డెక్కన్ ఉడ్ ఓల్డ్ సిటీ సినిమా కాదు…. "సలామ్ జిందగీ" ట్రైలర్ విడుదల…

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తరహాలో వరుస చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకొంటున్న మరో చిత్ర పరిశ్రమ "డెక్కన్ వుడ్". హైదరాబాదీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ డెక్కన్ వుడ్ నుండి ఇదివరకు వచ్చిన "దావత్ ఎ షాదీ" మంచి విజయం సాధించి "డెక్కన్ వుడ్"కి మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. "దావత్ ఎ షాదీ" విజయం ఇచ్చిన స్పూర్తితో అదే బృందం తమ రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం "సలామ్ జిందగీ".

నౌబహార్ ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న ఈ చిత్రంలో మస్త్ అలీ, అజీజ్ నాజర్, ధీర్ చరణ్ శ్రీవాత్సవ్, ఫిరోజ్ ఖాన్ లు ముఖ్యపాత్రలు పోషిస్తుండగా ఊరూసా రహీమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సయ్యద్ హుస్సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు 60% అమెరికాలో జరుగుపుకోవడం విశేషం.

హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన "సలామ్ జిందగీ" ట్రైలర్ ను నిన్న (బుధవారం) సాయంత్రం ప్రముఖ వ్యాపారవేత్త ఇఫ్తెకార్ షరీఫ్ విడుదల చేశారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ వేడుకకు నటుడు-నిర్మాత ఆర్.కె.మామా మరియు "సలామ్ జిందగీ" చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇఫ్తెకార్ షరీఫ్ మాట్లాడుతూ.. "ఇప్పుడే "డెక్కన్ వుడ్"కు ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది. మునుపటి చిత్రం "దావత్ ఎ షాదీ"ని ప్రేక్షకలోకం ఆదరించి మంచి విజయాన్ని అందించింది. ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని "సలామ్ జిందగీ" చిత్రాన్ని మరింత భారీ బడ్జెట్ తో అమెరికాలో షూట్ చేయడం జరిగింది. ట్రైలర్ చాలా బాగుంది, తెలుగు ప్రేక్షకులు కూడా "సలామ్ జిందగీ" చిత్రాన్ని ఆదరించాలని కోరుకొంటున్నాను" అన్నారు.

చిత్ర దర్శకుడు సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ.. "మా ఇఫ్తెకార్ షరీఫ్ గారు అందిస్తున్న ప్రోత్సాహం వల్లే "డెక్కన్ వుడ్"కి ఇప్పుడు గుర్తింపు లభిస్తోంది. ఇదివరకు నా దర్శకత్వంలో రూపొందిన "దావత్ ఎ షాదీ" చిత్రానికి చాలా మంచి ప్రోత్సాహం లభించింది. యూట్యూబ్ లోనూ మా చిత్రానికి 50 లక్షల వ్యూస్ రావడం మా "డెక్కన్ వుడ్"కు ప్రోత్సాహకరం. "డెక్కన్ వుడ్" సినిమాలంటే కేవలం ఉర్దూ చిత్రాలని ఓల్డ్ సిటీ వారికే పరిమితమని అనుకొంటున్నారు. ఆ బోర్డర్ ను బ్రేక్ చేసి "డెక్కన్ వుడ్" చిత్రాలు కూడా అందరూ చూడదగ్గ చిత్రాలని ప్రూవ్ చేయడానికే "సలామ్ జిందగీ" చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక విలువలతో, ఆరోగ్యకరమైన హాస్యంతో రూపొందించాం. అన్నీ వర్గాల ప్రేక్షకులూ ఆనందించదగిన చిత్రమిది. దాదాపు 60% చిత్రీకరణను అమెరికాలో జరిపాం. ఆద్యంతం అలరించే హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన "సలామ్ జిందగీ"ని ఈద్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఆడియోను కూడా విడుదల చేస్తాం" అన్నారు.

చిత్ర కథానాయకుల్లో ఒకరైన మస్త్ అలీ మాట్లాడుతూ.. "నన్ను నటుడిగా ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు, "సలామ్ జిందగీ"తో కథానాయకుడిగానూ ఆదరించి మా "డెక్కన్ వుడ్" పురోగతికి తోడ్పడతారని ఆశిస్తున్నాను" అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో నటించిన ఇతర తారాగణమంతా "సలామ్ జిందగీ" చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకలోకం తమ "డెక్కన్ వుడ్"ను ఆదరించాలని కోరారు!