సన్నీ లియోనీ ఎవరో నాకు తెలియదు – ‘కొబ్బరి మట్ట’కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు

‘హృదయ కాలేయం’ సినిమా విడుదలైన తర్వాత జనాలు ఫోన్లు చేసి మరీ తిట్టారని కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు చెప్పారు. ఆయన నటించిన చిత్రం ‘కొబ్బరి మట్ట’. ఈ సినిమాకు రూప‌క్ రొనాల్డ్ స‌న్ దర్శకత్వం వహించారు. ఇందులో సంపూ త్రిపాత్రాభినయం చేశారు. ఆగస్టు 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా సంపూ మీడియాతో మాట్లాడారు. తన సినీ కెరీర్‌ గురించి ముచ్చటించారు.

* ‘‘హృదయ కాలేయం’ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నాపై దాడులు కూడా జరిగాయి. చాలా బాధపడ్డా. ఇవన్నీ నేను మొదటి నుంచి ఎదుర్కొంటున్నా. ‘హృదయ కాలేయం’ పోస్టర్‌ విడుదల చేసినప్పటి నుంచి జనాలు నన్ను బండ బూతులు తిట్టారు. కొందరు సినిమా విడుదలైన తర్వాత ఫోన్లు చేసి మరీ తిట్టారు. నిజంగా సినిమా తీయాలంటే ఇంత అనుభవించాలా? అనుకున్నాం. ఎప్పుడైతే ఎస్.ఎస్‌. రాజమౌళి గారు ‘హృదయ కాలేయం’ గురించి ట్వీట్‌ చేశారో.. అప్పటి నుంచి తిట్లు తగ్గాయి. క్రమంగా విమర్శలు ఆగాయి’.

* ‘‘వైరస్‌’ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. హిట్‌ అనేది మన చేతుల్లో లేదు. ప్రేక్షకులు ఏదిస్తే.. దాన్నే తీసుకోవాలి. నేను కథల ఎంపిక గురించి ఇప్పటి వరకు అంత స్పష్టంగా ఆలోచించలేదు. కాస్త జాగ్రత్తగా ఎంచుకోవాలి అనుకుంటానంతే. ‘కరెంటు తీగ’ సినిమా మోహన్‌బాబు గారి బ్యానర్‌లో కావడంతో అడిగిన వెంటనే ఓకే చెప్పాను. ఇక ‘కొబ్బరిమట్ట’ ‘హృదయ కాలేయం’ మేకర్స్‌ తీస్తున్నారు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం రాలేదు’.

* ‘మీరు నమ్మరు (మీడియాను ఉద్దేశిస్తూ).. ‘కరెంటు తీగ’ సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు సన్నీ లియోనీ ఎవరో నాకు తెలియదు, ఆ తర్వాత తెలుసుకున్నా (నవ్వుతూ). ఆమె గురించి తెలియదా? అని అందరూ ఆశ్చర్యపోయారు. మా ఇద్దరి మధ్య సంభాషణ లేదు. నాకు ఇంగ్లిషు రాదు, ఆమెకు తెలుగు రాదు (మళ్లీ నవ్వుతూ), కాబట్టి ఆమెతో మాట్లాడే అవసరం రాలేదు. నమస్తే.. అన్నారు, నమస్తే చెప్పాను. అంతే..(నవ్వుతూ)’.

* ‘డ్యాన్స్‌, నటన.. దేనికైనా ముందుగా సాధన చేసేవాడ్ని. షూటింగ్‌లో ఎక్కువ టేక్‌లు తీసుకునేవాడ్ని కాదు. నేను రీటేక్‌ తీసుకుంటే సాయి రాజేష్‌ తిట్టేవాడు. ‘నీకు రాదు’ అనేవాడు. నేను కూడా ‘నాకు రాదు’ అనుకునేవాడ్ని (నవ్వుతూ). అందుకే బాగా సాధన చేసేవాడ్ని. ఒకేసారి కెమెరా ముందు పర్‌ఫెక్ట్‌గా చేసేవాడ్ని. ఈ సినిమా డైలాగ్‌ విషయంలో మొత్తం ఐడీయా సాయి రాజేష్‌ అన్నది. షూట్‌లో ఎవరి నుంచి సమస్య వచ్చినా.. నేను డైలాగ్‌ చెప్పడం ఆపేస్తానని అందరికీ ముందే జాగ్రత్తలు చెప్పారు. చివరికి డైలాగ్‌ సింగిల్‌ టేక్‌లో చెప్పేశా. సాధన ఉంటే నేను దేన్నైనా చేయగలను’.