రామోజీ గ్రూప్స్‌లో రూ.100ల కోట్ల భారీ స్కామ్

ప్రముఖ పత్రికాధినేత చెరుకూరి రామోజీరావు గ్రూప్స్‌లో రూ.100ల కోట్ల భారీ స్కాం జరిగినట్టు సమాచారం. దీంతో చాలా ఆగ్రహంగా ఉన్న రామోజీరావు తన సంస్థలన్నింటిలో ఇంటర్నల్ ఆడిటింగ్‌తో పాటు సంస్థలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం. ఈ ఆడిటింగ్ ప్రస్తుతం అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజనతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఈనాడు గ్రూప్ యాజమాన్యం కూడా ప్రక్షాళనకు రంగంలోకి దిగింది. పాఠకుల ఆదరణకు నోచుకోలేకపోతున్న విపుల, చతుర, సితార లాంటి పత్రికలను మూసివేయాలని దాదాపు నిర్ణయం తీసేసుకున్నారు. ఇక తన సంస్థలో మిషనరీ సెక్షన్లలో పని చేసే 150 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు సమాచారం. వీరికి భారీ మొత్తంలోనే చెల్లింపులు చేసి వదిలించుకున్నారని వినికిడి. అలాగే జిల్లాకో యూనిట్ ఉన్న ఈనాడులో ఇక నుంచి రెండు మూడు జిల్లాల యూనిట్లను కలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలో వెయ్యి ఎకరాల ఒకే బిట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. తెలంగాణలోని సగం జిల్లాలకు ఈనాడు దినపత్రికను ఇక్కడ నుంచే ప్రింటింగ్ చేసి పంపేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనిట్ మొత్తాన్ని రాజమండ్రికి తరలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కొత్తగా రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పడితే ఈ మూడు జిల్లాల డెస్క్‌లతో పాటు ప్రింటింగ్‌ను అక్కడ నుంచే చేయనున్నారు. 

రాష్ట్ర విభజనతో తెలంగాణ, ఏపీలకు ప్రత్యేకంగా మెయిన్ ఎడిషన్ల నిర్వహణ తొలిసారిగా ఈనాడే ప్రారంభించింది. అలాగే తెలంగాణ తొలి న్యూస్‌ఛానెల్ కూడా ఈనాడే ప్రారంభించింది. గత ఆరేడు నెలలుగా ఈ హడావిడిలో ఉండడంతో తీరా ఎన్నికలై కొత్త రాష్ట్రాల విభజన జరిగాక ఈ స్కాం వ్యవహారం బయటకొచ్చిందట. వాస్తవంగా ఈనాడులో ఉద్యోగం అంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుందన్న నమ్మకం ఉద్యోగుల్లో ఉంది. ఇప్పుడా పరిస్థితి లేదని తెలుస్తోంది. ఉదాహరణకు కొందరిని బలవంతంగా వదిలించుకోవాలన్న ఉద్ధేశ్యంతో కావాలని తెలంగాణ ఉద్యోగులను ఎక్కడో ఉత్తరాంధ్రకు, అక్కడ వారిని తెలంగాణ జిల్లాలకు బదిలీ చేయిస్తున్నారు. ఇటీవల బదిలీల పర్వం బాగా జరిగింది. ఈటీవీ-2లో ఉద్యోగులకు ఎప్పుడోనే తాము ఇంతకు మించి జీతం ఇవ్వలేం అని ఒక కటాప్ చెప్పేశారు. ఇప్పుడు ఏకంగా ఈనాడు పేపర్ ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పేశారని గుసగుసలు బయటకు పొక్కుతున్నాయి. ఉద్యోగాలకు ఢోకా ఉండదు. కానీ ఇంతకు మించి తాము ఇవ్వలేం అని బయటకు వెళితే వెళ్లిపోవచ్చని చెప్పేస్తున్నారట. 

అలాగే రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బాహుబలిలో కూడా రామోజీ రూ.40 నుంచి 50 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని సమాచారం. అందుకోసమే ఆయన ఇటీవల ఫిలింసిటీలో జరుగుతున్న ఆ సినిమా షూటింగ్‌ను సందర్శించి చిత్ర యూనిట్‌తో పాటు రాజమౌళికి అభినందనలు తెలిపారు. అలాగే గతంలో చిన్న సినిమాలు తీసి కూడా ఉషోదయ బ్యానర్ సూపర్ సక్సెస్‌లు అందుకుంది. ఈ కోవలోనే రవిబాబు దర్శకత్వంలో ఓ చిన్న సినిమాను నిర్మించే ఆలోచన చేస్తున్నారట. ఇక నుంచి ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎలాగు ఫిల్మ్‌సిటీలోనే సినిమాలు తీసేయొచ్చు. ఆదాయం కోసం వారి వద్ద ఉన్న వనరులన్ని ఉపయోగించుకుని ఏ ఒక్క అవకాశాన్ని వదులకోకూడదని అలాగే వీలైనంత వరకు ఖర్చు భారీగా తగ్గించుకునేలా రామోజీ వ్యూహం రచిస్తున్నారు.