‘ఎన్టీఆర్ ఆత్మ‌కు శాంతించాలంటే బాల‌య్య సీఎం అవ్వాలి ‘

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణమే ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను ఏపీకి సీఎం చేయాల‌ని తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాజ‌కీయాల్లో డ‌బ్బుల‌కు ఎమ్మెల్యేల‌ను కొనే సంస్కృతి చంద్ర‌బాబుతోనే స్టార్ట్ అయ్యింద‌న్నారు.

చంద్ర‌బాబు సీఎం అయిన‌ప్ప‌డు ఆయ‌న‌కు అండ‌గా నిలిచింది కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయటంలో చంద్రులిద్దరూ గురుశిష్యులేనని చెప్పారు. తాజా ఘటనతో దొరికిన వాళ్లే దొంగలు అయ్యారని షబ్బీర్ అన్నారు. చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

చంద్ర‌బాబు వెంట‌నే సీఎం కుర్చీ నుంచి దిగి ఆయ‌న బావ‌మ‌రిది, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ను సీఎం చేస్తే ఎక్క‌డో ఉన్న ఎన్టీఆర్ ఆత్మ‌కు కాస్త శాంతి క‌లుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.