శశిథరూర్‌కు పోలీసుల ప్రశ్నలివే… చిరునవ్వు, మౌనమే జవాబు..!

కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఆయన భార్య సునందపుష్కర్ మృతి కేసులో తమ విచారణకు సహకరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి నాలుగు గంటల పాటు ఆయన్ను పోలీసులు వివిధ రకాల ప్రశ్నలతో ఇంటరాగేట్ చేశారు. సునంద మృతి చెందిన రోజు ఏం జరిగింది? గొడవులు జరిగాయా? ఐపీఎల్ లావాదేవీలు ఏమిటి? జనవరి 15న తిరుపనంతపురం నుంచి తిరిగి వచ్చిన సునంద ఒంటరిగా హోటల్ గదిలో ఎందుకు ఉన్నారు? ఆమె ఆరోగ్య పరిస్థితి? పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో థరూర్‌కు సంబంధాలు? అన్న వివిధ ప్రశ్నలను పోలీసులు థరూర్‌కు సంధించారు. ఈ సందర్భంగా శశిథరూర్ పోలీసులు సంధించిన పదుల సంఖ్యలో ప్రశ్నలకు కొన్నిసార్లు చిరునవ్వుతో.. కొన్ని సార్లు మౌనంగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అదనపు డీసీపీ కుష్వా నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం థరూర్‌ను ప్రశ్నించింది. ఈ కేసులు ఇంకా పలువురిని విచారించాలని పోలీసులు తెలిపారు.