టీ – సీఎం పేషీ అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రముఖ వార పత్రిక ఔట్ లుక్ పై సీరియస్ అయ్యారు. తనపై అనుచినత వ్యాఖ్యలు చేస్తూ సంబంధిత పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించడాన్ని తప్పుబట్టారు. దీనిపై తనకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఔట్ లుక్ వ్యవహారంపై ఐఏఎస్ అధికారుల సంఘం కూడా గుర్రుగానే ఉంది. ఆమె కట్టూ – బొట్టూ ఫ్యాషన్ ఐకన్ ను ప్రతిబింబిస్తాయని ఔట్ లుక్ తన కథనం నో బోరింగ్ బాబులో రాయడంపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. అంతేకాక ట్రౌజర్, టాప్ ధరించి, ఓ ఫ్యాషన్ షోకు హాజరై ఫొటోగ్రాఫర్‌కు పనికల్పించారంటూ పేర్కొనడం ఓ మహిళా అధికారి స్థాయిని తగ్గించడమే అని ఐఏఎస్ ల సంఘం అభిప్రాయపడుతోంది. కాగా .. గడిచిన 20 ఏళ్లుగా ఔట్ లుక్ పత్రికను రహేజా గ్రూపు నిర్వహిస్తోంది. స్మితా సబర్వాల్ పై కథనాన్ని డీప్ త్రోట్ కాలమ్ కింద ప్రచురించి, వివాదాస్పదమైంది.
ఓ మంచి ఐఏఎస్ అధికారిగా పేరున్న స్మితా సబర్వాల్ తన పరువుకు భంగం వాటిల్లేలా ఔట్ లుక్ కథనం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆమె భర్త అకున్ సబర్వాల్ ప్రముఖ ఐపీఎస్ అధికారి. స్మిత స్వస్థలం పశ్చిమబెంగాల్. యూపీఎస్పీ ఎగ్జామ్స్ లో ఆమె నాలుగో ర్యాంకర్‌గా నిలిచారు. 20011 ఏప్రిల్‌లో తొలి పోస్టింగ్ పొంది, కరీంనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ విద్యా, ఆరోగ్య సంబంధ విషయాలకు సమున్నత ప్రాధాన్యం ఇచ్చి అందరి మన్ననలు అందుకున్నారు. రాష్ట్ర విభజన అయ్యాక తెలంగాణ సర్కార్ ఆమె సేవలు మెచ్చి, సీఎం పేషీలో అడిషనల్ సెక్రటరీగా నియమించింది.