విండీస్ మ్యాచ్‌ను రిపీట్ చేసిన దక్షిణాఫ్రికా..ఐర్లండ్ చిత్తు

వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా రిపీట్ చేసింది. ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 201 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. ఓపెనర్ హషీమ్ఆమ్లా, డుప్లెసిస్ శతకాలతో ఐర్లండ్ బౌలర్లకు చక్కలు కనిపించాయి. 

డుప్లెసిస్ 109 పరుగులు(109 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్), ఆమ్లా 159 పరుగులు(128 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు) చేశారు. చివర్లో రోసో 61 పరుగులు(30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. మిల్లర్ 46 పరుగులు(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశారు. దీంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 411 పరుగులు చేసింది. 

412 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లండ్ 48/5 తో పీకల్లోతు కష్టాల్లో ఉంది. చివరకు 45 ఓవర్లలో 210 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. బాల్బిర్నె 58, కెవిన్ ఒబ్రెయిన్ 48 పరుగులు చేయడంతో పరువు దక్కించుకుని 200 పరుగులు మార్క్ చేరుకుంది. ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

మొన్న వెస్టిండిస్‌తో మ్యాచ్‌లోను 400 పరుగులు సాధించి..ఘనవిజయం సాధించిన దక్షిణాఫ్రికా మరోసారి 400 పరుగుల పైచిలుకు స్కోరు సాధించి ఐర్లండ్‌ను చిత్తు చేసి నాకౌట్ రేసులో ముందంజలో ఉంది.