ఫస్ట్ లుక్ తో థ్రిల్ చేశాడు…. రాగల టీజర్ ఎట్లుంటదో….

శ్రీనివాస రెడ్డి.. ఈ పేరుకు తెలుగులో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాటాబిర్లా మ‌ధ్య‌లో లైలా, అదిరింద‌య్యా చంద్రం, య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది, బొమ్మ‌న బ్ర‌ద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్ లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత నాగార్జున లాంటి స్టార్ హీరోతో భారీ బ‌డ్జెట్ తో ఢ‌మ‌రుకం సినిమా తెర‌కెక్కించాడు. ఫాంట‌సీ క‌థ‌తో వ‌చ్చిన ఈ చిత్రంతో శ్రీనివాస రెడ్డి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఆ సినిమా త‌ర్వాత కొన్నేళ్లు బ్రేక్ తీసుకుని ఇప్పుడు మ‌ళ్లీ కొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. తాజాగా ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నిహస్ క్రియేషన్స్ బ్యానర్ పై రాగ‌ల 24 గంట‌ల్లో అనే భిన్న‌మైన సినిమా వ‌స్తుంది. ఇందులో సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సాధార‌ణంగా వాతావ‌ర‌ణం గురించి చెప్ప‌డానికి టీవీల్లో ఈ ప‌దాల‌ను వాడుతుంటారు. ఇప్పుడు సినిమా కోసం కూడా ఇదే లైన్ వాడుకున్నాడు శ్రీ‌నివాస రెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు కామెడీ సినిమాలు చేస్తూ వ‌చ్చిన ఈయ‌న‌.. ఇప్పుడు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేసాడు. జోన‌ర్ మార్చి కొత్త‌గా ప్ర‌య‌త్నించాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌న క‌థ‌లో రాగల 24 గంటల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయని.. అవి ఏంట‌నేది క‌థ అంటున్నాడు ఈయ‌న‌. అందుకే టైటిల్ కూడా కొత్త‌గా ఉంటుంద‌ని ఇది పెట్టేసిన‌ట్లు చెప్పాడు శ్రీనివాస రెడ్డి. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ వైపు థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే మ‌రోవైపు త‌న స్టైల్ ఆఫ్ ఫ‌న్ కూడా మిస్ అవ్వ‌దంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. జులైలో సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ చిత్రంతో శ్రీ‌నివాస రెడ్డి మ‌రోసారి స‌త్తా చూపిస్తాడేమో చూడాలిక‌.