హీరోల‌ను బ‌ట్టే కారెక్ట‌ర్లా సుకుమారా..?

సుకుమార్.. ఈయ‌న ఓ భిన్న‌మైన ద‌ర్శ‌కుడు. అంద‌ర్లాంటి సినిమాలు చేయ‌డం ఈయ‌న‌కు ఎందుకో ఇష్టం ఉండ‌దు. హాలీవుడ్ రేంజ్ కు తెలుగు సినిమాను తీసుకెళ్దామ‌నుకుంటాడు.. కానీ మ‌న ప్రేక్ష‌కులే అక్క‌డికి రారు. అందుకే సుకుమార్ సినిమాలు పెద్ద‌గా ఆడ‌వు. ఎప్పుడూ అర్థం కాని క‌థ‌ల‌ను తీసుకుని ప్ర‌యోగాలు చేయ‌డం ఈ ద‌ర్శ‌కుడి అల‌వాటు. మ‌హేశ్ నేనొక్క‌డినే, రామ్ జ‌గ‌డం లాంటి సినిమాల‌న్నీ ఈ ప్ర‌యోగాలే. ఇప్పుడు ఎన్టీఆర్ తో నాన్న‌కు ప్రేమ‌తో సినిమా చేస్తున్నాడు సుకుమార్.

నంద‌మూరి అభిమానులు ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గానే క‌నిపిస్తున్నా.. ఎక్క‌డో సుకుమార్ టెన్ష‌న్ మాత్రం వాళ్ల‌ను విడిచిపెట్ట‌డం లేదు. సుకుమార్ కూడా హీరోల‌ను బ‌ట్టి క‌థ‌లు ఎంచుకుంటున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు సుకుమార్ చేసిన అన్ని సినిమాల్లో హీరో కారెక్ట‌రైజేష‌న్ నెగిటివ్ ట‌చ్ లో సాగుతుంది. నేనొక్క‌డినేలో మాత్రం దీనికి కాస్త మిన‌హాయింపు ఇచ్చాడు లెక్క‌ల‌మాస్టారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ను మంచికొడుకుగా చూపిస్తున్నాడు. బ‌న్నీతో సినిమా అంటే స్టైల్ కు పెద్ద‌పీట వేస్తాడు సుకుమార్.. అదే మ‌హేశ్ తో అయితే హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్ క‌థ తీసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే ఎమోష‌న‌ల్ జ‌ర్నీ చేయిస్తున్నాడు. మొత్తానికి హీరో మారిన‌పుడు.. త‌న స్టైల్ ఆఫ్ వ‌ర్కింగ్ కూడా మార్చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి నాన్న‌కు ప్రేమ‌తో అయినా సుకుమార్ కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ తీసుకొస్తుందా లేదా చూడాలి..!