సూర్య ఎట్ట‌కేల‌కు సాధించాడు..!

సూర్య.. ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలో ఉన్న అతికొద్ది మంది న‌టుల్లో ఒక‌రు. ఇంకా చెప్పాలంటే క‌మ‌ల్ త‌ర్వాత ఆ స్థాయిలో న‌టించ‌ద‌గ్గ మొన‌గాడు. ఎంత మంది హీరోలున్నా.. సూర్య మాత్రం న‌టుడు. పాత్ర న‌చ్చితే ఎలాంటి రిస్క్ చేయ‌డానికైనా వెన‌కాడ‌డు సూర్య‌. ఇలాంటి హీరోకు ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స ప్లాపులొచ్చాయి. ప్ర‌యోగాలు కూడా దెబ్బ‌తీసాయి. సెవెన్త్ సెన్స్ చేస్తే ప్రేక్ష‌కుల‌కు అర్థం కాలేదు. క‌నీసం క‌మ‌ర్షియ‌ల్ గా కూడా పాస్ కాలేక పోయింది ఈ సినిమా. మురుగ‌దాస్ చెప్పిన లాజిక్ జ‌నాల బుర్ర‌ల్లోకి ఎక్క‌లేదు.

అంత‌కుముందు గ‌జినీ బాగానే వ‌ర్కవుట్ అయినా.. సెవెన్త్ సెన్స్ విష‌యంలో లెక్క త‌ప్పాడు మురుగ‌దాస్. ఆ త‌ర్వాత కేవీ ఆనంద్ తో అయాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చేసిన బ్ర‌ద‌ర్స్ ఫ్లాపైంది. ఇది కూడా ఓ ర‌క‌మైన సైన్స్ ప్ర‌యోగ‌మే. కానీ సినిమాకు పాస్ మార్కులు ప‌డ‌లేదు. ఇలా వ‌ర‌స‌గా ప్ర‌యోగాలు దెబ్బ కొడుతున్నా.. ఎక్క‌డ పోగొట్టుకున్నాడో అక్క‌డే వెత‌కాలి అనే కాన్సెప్ట్ కు క‌నెక్ట‌య్యాడు సూర్య‌.

ఇప్పుడు 24తో మ‌రో ప్ర‌యోగం చేసి స‌క్సెస్ అయ్యాడు. ఈ సారి డిస్టింక్ష‌న్ లో కాదు.. ఏకంగా స్టేట్ ర్యాంక్ కొట్టేసాడు సూర్య‌. విక్ర‌మ్ కే కుమార్ బ్రిలియ‌న్స్ కు సూర్య న‌ట‌న తోడై 24 ఘ‌న‌విజ‌యం వైపు అడుగేస్తోంది. ఇన్నాళ్ల సూర్య క‌ల‌ల్ని తీర్చేసింది ఈ చిత్రం. 24కి సూర్య హీరో మాత్ర‌మే కాదు.. నిర్మాత కూడా. ఇలాంటి క‌థ‌కు కోట్లు పోయాలంటే ఎంతో న‌మ్మ‌కం ఉండాలి. ఏ మాత్రం తేడా జ‌రిగినా మొత్తం పోతాయ‌ని తెలుసు. కానీ సూర్య వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌న‌లోని న‌టుడితో పాటు నిర్మాత‌కు కూడా విజ‌యాన్ని తీసుకొచ్చాడు 24 సినిమాతో. సూర్య న‌మ్మ‌క‌మే గెలిచిందిప్పుడు. అద్భుత‌మైన క‌థ‌కు అంతే అద్భుత‌మైన ద‌ర్శ‌కుడిని తీసుకుని కెరీర్ లో నిలిచిపోయే విజ‌యాన్ని అందుకున్నాడు సూర్య‌.