ఎన్ కౌంటర్ లో కీలక మలుపు

నల్లగొండ: నల్గొండ ఎన్ కౌంటర్ లో కీలక మలుపు చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో ఓ రైల్వే టిక్కెట్ లభ్యమైంది. ఈ నెల 2వ తేదీన న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్కు ప్రయాణించిన రైల్వే టిక్కెట్  ఎన్కౌంటర్లో హతమైన దుండగుల దగ్గర లభించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి ప్రయాణం చేసిట్లు టిక్కెట్ వివరాలు ద్వారా తెలుస్తోంది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు న్యూఢిల్లీ నుంచి వచ్చినట్లు అయితే మరో నిందితుడు ఎక్కడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సూర్యాపేట కాల్పుల ఘటనలో తప్పించుకుంది ఇద్దరు కాగా, తాజాగా బయటపడ్డ మూడో వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా సూర్యాపేటలో కాల్పులకు పాల్పడి పరారైనవారు.. ఎన్కౌంటర్లో మృతి చెందినవారు ఒకరే అని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే సూర్యాపేట పోలీసుల వద్ద నుంచి ఎత్తుకెళ్లిన కార్బన్ నిందితుల దగ్గర లభించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో తప్పించుకున్న ఇద్దరిలో ఒకరు పరారీలో ఉన్నారా? న్యూఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి తన ముఠా సభ్యులను కలుసుకున్నాడా? ఎన్కౌంటర్లో ఇద్దరు మరణిస్తే.. మూడో వ్యక్తి ఎక్కడా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. అసలు వీళ్ల టార్గెట్ ఏంటీ అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.