సైరాలో డాన్సులు వ‌ద్దు.. అభిమానుల‌కు షాక్ ఇచ్చిన మెగాస్టార్..

చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది డాన్సులే. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు కొత్త స్టెప్పులు ఏముంటాయా అని వేచి చూస్తుంటారు ఫ్యాన్స్. ప్రేక్ష‌కులు కూడా చిరు డాన్సుల కోసం ఎదురు చూస్తుంటారు. ప‌దేళ్ల త‌ర్వాత ఆయ‌న న‌టించిన ఖైదీ నెం 150లో కూడా అదిరిపోయే చిందులేసాడు చిరంజీవి. మున‌ప‌టి జోష్ ఆ డాన్సుల్లో లేక‌పోయినా కూడా గ్రేస్ త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు అన్న‌య్య‌. ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వ‌రకు కూడా అమ్మ‌డు కుమ్ముడు అంటూ ఊపేసాడు చిరంజీవి. అలాంటి మెగాస్టార్ ఇప్పుడు డాన్సులు వ‌ద్దంటున్నాడు. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్న విష‌యం. ప్ర‌స్తుతం సైరా సినిమాలో న‌టిస్తున్న చిరంజీవి.. ఇందులో ఎలాంటి డాన్సులు వ‌ద్ద‌ని చెబుతున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ నెంబ‌ర్ ప్లాన్ చేసాడు సురేంద‌ర్ రెడ్డి.
అందులో మెగాస్టార్ కూడా స్టెప్పులేయాలి. దీనికోసం శేఖ‌ర్ మాస్ట‌ర్ కూడా స్టెప్స్ రెడీ చేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఈయ‌న మాత్రం సైరాలో ఎలాంటి డాన్సులు వద్ద‌ని చెబుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. దానికి కూడా ఓ కార‌ణం లేక‌పోలేదు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి సినిమా కావ‌డంతో ఇందులో డాన్సులు వ‌ద్దంటున్నాడు మెగాస్టార్. కావాలంటే త‌ర్వాత సినిమాలో చూసుకుందాం కానీ ఇప్పుడు మాత్రం వ‌ద్దంటున్నాడు. చిరు స‌ల‌హాతో ఇప్పుడు సురేంద‌ర్ రెడ్డి కూడా ఈ స్పెష‌ల్ నెంబ‌ర్ పై ఆస‌క్తి త‌గ్గించుకుంటున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న సైరా అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. ఆగ‌స్ట్ 22న చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డానికి చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి ఉప్పు లేని పప్పులా డాన్సులు లేని చిరంజీవి సినిమా ఎలా ఉండబోతుందో మ‌రి..?