విజయవాడ రౌడీషీటర్స్ అడ్డా అని చూపించలేదు, ఈ నెల 23న ‘రంగు’ విడుదలవుతుంది

విజయవాడలో కొన్నాళ్ల క్రితం సంచలనం సృష్టించిన కేస్ ‘లారా’. అతని కథనే ఇప్పుడు తనీష్ హీరోగా ‘రంగు’ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కాబోతోంది. లారా ఓ
సాధారణ మధ్య తరగతి యువకుడు. అతను రౌడీ షీటర్ గా ఎందుకు మారాడు.. ఎలా మారాడు.. అందుకు దారితీసిన పరిస్థితులేంటీ అనే నేపథ్యంలో రూపొందిన సినిమానే ఈ ‘రంగు’. అయితే
ఈ సినిమాలో లారాను రౌడీషీటర్ గా చూపించారని అతని కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాము లారా జీవితాన్ని వక్రీకరించలేదనీ..
అతని కథ చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మెచ్చుకుంటారని అతని కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్లందరికీ వివరణ ఇస్తూ.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు..
ఈ సందర్భంగా సినిమా నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ..
‘‘ లారా జీవితంలో ఏం జరిగిందనేది హండ్రెడ్ పర్సెంట్ తీశాం. కానీ అతన్ని ఎక్కడా తక్కువ చేయలేదు. అతను మా సినిమాలో హీరో. లారాకు అంతే వాల్యూ ఇస్తూ సినిమా తీశాం. లారా కుటుంబ
సభ్యులను కూడా కలిశాం. లారాపై ఎందుకు రౌడీ షీట్ తీశారు. అందుకు దారితీసిన పరిస్థితులేంటీ అనేవి చూపించాం. లారా గొప్పదనంతో పాటు.. అతను ఎంత గొప్పగా జీవించాడు అనేది మా
సినిమా చూశాక తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత లారా జీవితంపై ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇదే విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పాం. అప్పుడు వాళ్లు మాకు ఒక షో
వేయమని చెప్పారు. త్వరలోనే వాళ్లకు షో వేస్తాం. ఒకవేళ వాళ్లు ఏవైనా మార్పులు చెబితే ఖచ్చితంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే మరికొందరు విజయవాడ అంటే రౌడీషీటర్స్ అడ్డాగా
కనిపిస్తోందా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు. కానీ మా ఉద్దేశ్యం అది కాదు. ఇది కేవలం విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కథ. అతను రౌడీషీటర్ అవడం వల్ల అలా అనిపిస్తుంది కానీ.. మేం
విజయవాడ అంటే రౌడీషీటర్స్ అడ్డా అని చెప్పడం లేదు. మేం కూడా ఈ ప్రాంతం వాళ్లమే.. మాకూ ఈ గడ్డపై గౌరవం ఉంది. ఫైనల్ గా ఈ సినిమా వారి కుటుంబ సభ్యులకే కాదు.. చూసిన ప్రతి
ఒక్కరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు..
దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘ ఈ సబ్జెక్ట్ ను చాలా యేళ్లుగా స్టడీ చేస్తున్నాను. ఈ క్రమంలో చాలామందిని కలిశాను. ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్లలో ఓ
వ్యక్తిని కలిశాను. అతను సమాజానికి తెలిసిన వ్యక్తిగా మాత్రమే చూస్తున్నారు.. కానీ ఓ కుటుంబ సభ్యుడుగా అతను చాలా గొప్పవాడు అని చెప్పారు. ఆ క్రమంలో నేనూ గతంలోనే చాలామందిని
కలిశాను. నాకు ఈ విషయాలన్నీ తెలుసు. తన కేస్ కు సంబంధించిన వ్యక్తులందరినీ కలిశాను. పోలీస్ ల వద్ద కూడా కొంత సమాచారం తెలుసుకున్నాను. అతని కథ విన్నప్పుడు కూడా నాకు
అనిపించింది ఇదే. అతను రౌడీషీటర్ గా చేయబడ్డాడు. అదే నాకు ఆసక్తిని పెంచింది. అతని అసలు పేరు గుంటూరు పవన్ కుమార్.. అలియాస్ లారా. అతని కథ నాకు బాగా నచ్చింది. వ్యక్తిగానూ
అతను చాలా మెచ్యూర్డ్. చదువులో ఫస్ట్. క్రెకెట్ లో బెస్ట్ గా ఉండేవాడు. ఇలా మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాతే సినిమా మొదలుపెట్టాను. అందుకే నేను వాళ్ల ఫ్యామిలీని తక్కువ చేసి చూపించే
ఉద్దేశ్యం లేదు. అందుకే వారికోసం ఓ ప్రత్యేకమైన షో వేస్తున్నాం. వారికి నచ్చుతుంది. లారా మళ్లీ పుట్టాడు అని వారూ ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది. థ్యాంక్యూ..’’ అని చెప్పారు.

ఇక హీరో తనీష్ మాట్లాడుతూ.. ‘‘ రంగు సినిమాలోని ప్రధాన పాత్రధారి లారా వివాదం గురించి మాట్లాడుతున్నాను. లారా కుటుంబ సభ్యులు చెబుతోన్న మాటల్ని నేను గౌరవిస్తాను. ఈ
సినిమాలో లారా పాత్రలో నేను నటించాను. అందుకే దీని గురించి మాట్లాడే బాధ్యత నాపై ఉంది. లారా వ్యక్తిత్వం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అతని కథ చూస్తే.. సమాజంలో ఎలా ఉండాలి..
ఉండకూడదు అనే విషయాలు తెలుస్తాయి. అతని జీవితంలో టీనేజ్ నుంచి 27యేళ్ల మధ్య కాలంలో జరిగిన కథ ఇది. అతని కథ తెలుసుకుని నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇక ఈ వివాదాలకు చెక్
పెట్టేందుకు మా దర్శకుడు, నిర్మాతలు సినిమా చూపించాలనుకుంటున్నారు. అందుకు నేను అభినందిస్తున్నాను. అలాగే నాకు లారా కథ విన్న తర్వాత ఏ ఫీలింగ్ కలిగిందో.. సినిమా చూసిన
తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా కళ్లనీళ్లతో బయటకు వస్తారు అనుకుంటున్నాను.. కానీ సినిమా ఆగుతుందని మాత్రం అనుకోవడం లేదు.. ఖచ్చితంగా చెప్పిన టైమ్ కు విడుదలవుతుంది’’
అని చెప్పాడు.

తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు, త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్: శ‌్రీనివాస్ నాయుడు గ‌ల‌భా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.ఎస్‌.చ‌క్ర‌వ‌ర్తి, కో ప్రొడ్యూస‌ర్‌: క‌ట‌కం వాసు, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, సాయికిర‌ణ్‌, సంగీతం: యోగీశ్వ‌ర శ‌ర్మ‌, ఎడిట‌ర్‌: పైడి బ‌స్వ రెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌: టి.సురేంద‌ర్ రెడ్డి, డైలాగ్స్‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ నిర్మాత‌లు: ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కార్తికేయ‌.