మనకు ఏది రైట్‌ అనిపిస్తే అది చేయాలనేది నా ఫిలాసఫీ – డైరెక్టర్ తరుణ్ భాస్కర్

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా ట్రెండ్ క్రియేట్ చేశాడు తరుణ్ భాస్కర్. ఇక ఇప్పుడు నటుడిగానూ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోగా నటించాడు. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గానూ బిజీగా ఉన్న తరుణ్ భాస్కర్ చెబుతున్న మీకు మాత్రమే చెబుతా విశేషాలు పంచుకున్నాడు.

‘నటన అనేది నా లక్ష్యం కాదు. దర్శకత్వమే నా మెయిన్‌ ఎయిమ్‌. దానిలోనే బాగా రాణించాలనుకుంటున్నా. అలాగే వంద కోట్ల సినిమాలు తీయాలనుకోవడం లేదు. చిన్న బడ్జెట్‌ చిత్రాలే చేస్తా’ అని అంటున్నారు తరుణ్‌ భాస్కర్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. అనసూయ, అభినవ్‌ గోమటం ఇతర ముఖ్య పాత్రధారులుగా షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో విజయ్ దేవరకొండ నిర్మించారు. నవంబర్‌ 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం తరుణ్‌భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ కథ విన్నప్పుడు ఇందులో నేను హీరోగా నటిస్తాననే విషయం తెలియదు. విజరు దేవరకొండ జనరల్‌గా తన స్క్రిప్ట్స్‌ వినమంటుంటాడు. అలా విన్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. తర్వాత నువ్వే హీరో అనేసరికి షాకయ్యాను. నేటి జనరేషన్‌లో పర్సనల్‌ లైఫ్‌ అనేది ఉండటం లేదు. సోషల్‌ మీడియా ద్వారా అంతా బయటకు తెలిసిపోతుంది. పెళ్ళి చేసుకునే టైమ్‌లో ఇలా వ్యక్తిగత జీవితం బయటపడితే లాభాలేంటి?, నష్టాలేంటి అనే కోణంలో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. దర్శకుడు షమ్మీర్‌ తమిళంలో పలు లఘు చిత్రాలు చేశారు. మంచి టాలెంటెడ్‌. సినిమాని బాగా డీల్‌ చేశారు. ‘పెళ్ళిచూపులు’ సినిమా తీసినప్పుడు, అది ఇంత పెద్ద హిట్‌ అవుతుందని, గేమ్‌ ఛేంజర్‌ చిత్రమవుతుందని ఊహించలేదు. నిజానికి దాన్ని ఏ భయం లేకుండా చేశాం. కానీ ఇప్పుడు భయమేస్తుంది. పెద్ద కాంబినేషన్‌, అంచనాలు ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయి. మనకు ఏది రైట్‌ అనిపిస్తే అది చేయాలనేది నా ఫిలాసఫీ. ‘ఫిదా’లో ఓ పాత్రలో నటించే అవకాశం వచ్చినప్పుడు మా అమ్మకి అదే చెప్పాను. ఇందులో హీరోగా అవకాశం వచ్చినప్పుడు తను కూడా నాకు ఇదే చెప్పింది. అయితే హీరోగా కొనసాగను. అప్పుడప్పుడు చేస్తా. నా మెయిన్‌ ఎయిమ్‌ డైరెక్షన్‌. వెంకటేష్‌ సినిమాకి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాను. స్పోర్ట్స్‌ డ్రామా చిత్రమది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ ‘ఈ నగరానికి ఏమైంది 2’, ‘లస్ట్‌ స్టోరీస్‌’లో ఓ పార్ట్‌ చేస్తున్నా’ అని తెలిపారు.