ప్రత్యూషను పరామర్శించిన సిఎం…బాధ్యత నాదే…సొంత ఖర్చులతో పెళ్లి చేస్తా…

జరిగిన దాన్ని పీడకలలా మర్చిపో. జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి. నిలబడాలి. జీవితం ఇంకా చాలా ఉంది. కొత్త జీవితం ప్రారంభించాలి. బాగా చదివి పైకి రావాలి. నీకు అండగా నేను ఉంటాను. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కూడా కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నేను నీ పెళ్లి జరిపిస్తా. హాస్పిటల్ నుంచి మా ఇంటికే రా. మంచి హాస్టల్ లో పెట్టి చదివిస్తా. ఎంపి కవిత కూడా నీకు తోడు ఉంటుంది. అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యూషతో అన్నారు. తండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్ర హింసలకు గాయాల పాలైన ప్రత్యూషకు భరోసా ఇచ్చారు. సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రత్యూష సతీమణి శోభారాణి తో కలిసి వెళ్లి పరామర్శించారు. చేతి ఖర్చుల కోసం కొంత నగదును కూడా అందించారు. వైద్యులతో మాట్లాడి ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యూషను పరామర్శించిన వారిలో హోం మినిస్టర్ నాయిని, ఎంపీలు కవిత, సుమన్, సైబరా బాద్ పోలీస్ కమిషనర్ సివి.ఆనంద్, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు తదితరులు ఉన్నారు.