రివ్యూ: టెంపర్ సమీక్ష

నటీనటులు: ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్
స్టోరీ: వక్కంతం వంశీ
సంగీతం: అనూప్‌రూబెన్స్, మణిశర్మ(బ్యాక్‌గ్రౌండ్)
నిర్మాత: బండ్ల గణేష్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2015

ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి విడుదల తేదీ వరకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తన స్థాయి హిట్ కోసం చూస్తున్న ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి కాంబినేషన్లో స్టార్ ప్రొడ్యుసర్ బండ్ల గణేష్ నిర్మించిన టెంపర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎన్టీఆర్ ఆశలను నిజం చేసిందా.. ఆయన ఫ్యాన్స్‌కు ఎంత వరకు కిక్ ఇచ్చిందో పల్లిబఠాని.కామ్ సమీక్షలో చూద్దాం.

టెంపర్ స్టోరీ:
దయ(ఎన్టీఆర్) అనాథ. పోలీస్ డ్రస్ వేసుకుంటే సమాజంలో దందాలకు, సెటిల్‌మెంట్లకు తిరుగేలేదని చిన్నప్పుడే తెలుసుకుని అడ్డదారిలో పోలీస్ అయిపోతాడు. సెటిల్‌మెంట్లు, అవినీతికి అండగా ఉంటూ లక్షలు పోగేసుకుంటుంటాడు. విశాఖపట్నంలో వాల్తేర్ వాసు(ప్రకాష్‌రాజ్) గుండాయిజం చేస్తుంటాడు. తనకు అడ్డుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ స్థానంలో మంత్రి జయప్రకాష్‌రెడ్డి ద్వారా తనకన్నా వరెస్ట్ ఫెలో అయిన దయాను అక్కడకు రప్పించుకుంటాడు. 

దయ వాల్తేర్ వాసు అక్రమాలకు అండగా ఉంటాడు. అక్కడ జంతు ప్రేమికురాలైన శాన్వి(కాజల్)ను ప్రేమిస్తాడు. అయితే అవినీతిపరుడైన దయా శాన్వి కోరికతో మారతాడు. శాన్వి దయాను కోరిన కోరిక ఏమిటి ? లక్ష్మి(మధురిమ)ను వాసు నుంచి ఎందుకు కాపాడతాడు ? చేయని తప్పును నెత్తిమీద వేసుకుని దయ ఉరిశిక్షకు ఎందుకు సిద్ధపడతాడు ? చివరకు దయ జీవితం ఏమైంది ? అన్నది తెరమీద చూసి తెలుసు కోవాల్సిందే.

టెంపర్ నటీనటుల పెర్ఫామెన్స్ ఎనలైజ్:
టెంపర్ నటీనటుల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది యంగ్‌టైగర్ గురించే. సినిమాలో తన నటనతోను, డ్యాన్స్, డైలాగ్ మాడ్యులేషన్, సిక్స్‌ఫ్యాక్ బాడీ, ఫైట్స్, స్టైల్ ఇలా అన్నింటిలోను తన ప్రదర్శనకు న్యాయం చేశాడు. ఎన్టీఆర్ నటనకు ఏసీన్‌లోను చిన్న వంక కూడా దొరకలేదంటే అతడు సినిమా కోసం ఆడియో ఫంక్షన్‌లో చెప్పినట్టు ఎంత కసితో పనిచేశాడో అర్థమవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పినట్టు అతడికి నటన అనేది తన చుట్టూ వైఫై లాగా ఉంది. ఫైట్స్‌లో చాలా నేచురల్‌గా నటించాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ నటన చూసిన ప్రతి ఒక్కరు శభాష్ మెచ్చుకుంటారు.

ఇక హీరోయిన్ కాజల్ ఎన్టీఆర్‌తో ఫస్టాఫ్‌లో నాలుగు సీన్లకు పాటలకు మాత్రమే పరితమైంది. చెప్పుకోదగిన పాత్ర కాజల్‌కు దక్కలేదు. పోసాని కృష్ణమురళీ హీరో తర్వాత రెండో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నిజాయితీపరుడైన పోలీస్ అధికారిగా చక్కని నటన కనపరిచాడు. ఎన్టీఆర్ అవినీతిని కళ్లతో చూస్తూ రేయ్ నువ్వు సునామిలో కొట్టుకు పోవాలిరా అంటూ ఎన్టీఆర్‌ను విమర్శించడం లాంటి మంచి సన్నివేశాలు పోసానికి దక్కాయి. 

విలన్‌గా చేసిన ప్రకాష్‌రాజ్ ఓకే. అతడు యాక్షన్‌లోకి దిగకపోయినా మెయిన్ విలన్‌గా హావభావాలు బాగా ప్రదర్శించాడు. ప్రకాష్‌రాజ్-ఎన్టీఆర్- జయప్రకాష్‌రెడ్డి మధ్య వచ్చే సన్నివేశాలు పర్వాలేదనిపించాయి. మధురిమ, సానియా అగర్వాల్ చిన్న పాత్రల్లో మెరిశారు. ఆలీ, సప్తగిరి ఒక్క సీన్‌కే పరిమితమయ్యారు. పతాక సన్నివేశాల్లో కోట జడ్జిగా ఆకట్టుకున్నారు. 

టెంపర్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజ్:
పాటల్లో లైలలైల, నే పనికి మాలిన యెదవని పాటల్లో కొత్త పదాలు కనిపించాయి. అనూప్ సంగీతం గత సినిమాలతో పోల్చుకుంటే కాస్త వీక్‌గానే ఉంది. మణిశర్మ ఈ యాక్షన్ మూవీకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అది సినిమాకు హెల్ప్ అయ్యింది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీలో ఎన్టీఆర్‌ను చాలా అందంగా చూపించాడు. ఫైట్స్, పాటల్లో ప్రతి ఫ్రేము బాగుంది. విజయ్ ఫైట్స్ సింపుల్‌గా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ చాలా నేచరల్‌గా నటించాడు. శేఖర్ ఎడిటింగ్ గ్రిప్పింగ్‌గా సాగింది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న బోరింగ్ సీన్ల విషయంలో దర్శకుడి వైఫల్యమే తప్ప ఎడిటర్‌ను తప్పుపట్టలేం. ఇక బండ్ల గణేష్ నిర్మాణ విలువలు సూపర్. మరోసారి బండ్ల భారీ చిత్రాల నిర్మాతగా తన స్థాయి నిరూపించుకున్నారు.

టెంపర్ స్టోరీ అండ్ డైరెక్షన్ ఎనలైజ్:
సినిమాకు కీలకమైన స్టోరీ, డైరెక్షన్ విభాగాల గురించి చెప్పుకోవాల్సి వస్తే స్టోరీ అందించిన వక్కంతం వంశీ ఇచ్చిన లైన్‌లో కొత్తదనం లేదు. గతంలో ఆయన స్టోరీ అందించిన కిక్, ఊసరవెల్లి, అశోక్ సినిమాల స్టోరీలతో పోలీస్తే ఇది వీక్‌గానే ఉంది. ఇక పూరి పంచ్ డైలాగ్స్, టేకింగ్ బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే వేగంగా ఉన్నా ఫస్టాఫ్‌లో దాదాపు అరగంట పాటు స్లోగా ఉంటుంది. 

డైరెక్షన్ చూసుకుంటే కథలో ఎంత సారం లేకున్నా దాన్ని ఎంత పిండినా రసం రాబట్టలేరు. ఇక్కడా అదే జరిగింది. అసలు పూరి, ఎన్టీఆర్ ఈ స్టోరీని ఎంచుకుని పెద్ద తప్పేచేశారనిపిస్తుంది. ఎన్టీఆర్-కాజల్ లవ్‌ట్రాక్ మరింత రక్తికట్టించాల్సింది. పాత కథను తీసుకున్న పూరి కొత్తగా ప్రజెంట్ చేయలేకపోయాడు. ఎన్టీఆర్‌ను స్టైలీష్‌గా, కొత్తగా చూపించాడు. చివరి 25 నిమిషాలతో సినిమాకు ప్రాణం పోశాడు దర్శకుడు పూరి. 

టెంపర్ మూవీ ఫ్లస్ పాయింట్స్:
ఎన్టీఆర్ నటన, డ్యాన్స్, డైలాగ్స్, స్టైల్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కోర్టు సీన్లు
సెకండాఫ్

టెంపర్ మూవీ మైనస్ పాయింట్స్:
రొటీన్ రివేంజ్ డ్రామా
ఫస్టాఫ్
కామెడీ మిస్ కావడం
యావరేజ్ స్క్రీన్‌ప్లే 

టెంపర్ మూవీ పల్లిబఠాని.కామ్ ఫైనల్ జస్టిఫికేషన్:
ఎన్నో అంచనాలతో వచ్చిన టెంపర్ ఎన్టీఆర్ షో అయిపోయింది. సినిమా మొత్తం ఎన్టీఆర్ డామినేట్ చేసేశాడు. దర్శకుడు కూడా మిగిలిన పాత్రలకు తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి టోటల్ కాన్‌సంట్రేషన్ ఎన్టీఆర్‌పై చేశాడు. హీరోయిజం ఓ రేంజ్‌లో ఉంది. సినిమా లైన్ పాతది కావడం మైనస్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే టెంపర్… మిగిలిన వారికి సాధారణ పోలీస్ రివేంజ్ డ్రామా చూసినట్టు ఉంటుంది. అయితే మాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో పాటు ఎన్టీఆర్ స్ల్టైలీష్ లుక్స్, డ్యాన్స్, క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి. ప్రస్తుతం పోటీ సినిమాలు లేకపోవడంతో భారీగానే కలెక్షన్లు రాబట్టే అవకాశాలున్నాయి. 

 టెంపర్ మూవీ: పల్లిబఠాని రేటింగ్- 3.5