తిప్పరా మీసం హీరో శ్రీ విష్ణు ఇంటర్వ్యూ

ఇటీవలే బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పుడు ఎప్పుడూ చేయనటువంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో హీరోగా మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. తిప్పరా మీసం పేరుతో రూపొందించిన ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భగా తిప్పరా మీసం విశేషాల్ని పంచుకున్నాడు.

‘నేను నటించిన గత చిత్రాల్లో బి, సి సెంటర్ల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు లేకపోవడంతో వారికి రీచ్‌ కాలేదు. ‘తిప్పరామీసం’లో అన్ని వర్గాల ఆడియెన్స్‌కి కావాల్సిన అంశాలుంటాయి. ఈ చిత్రంతో కచ్చితంగా బి, సి సెంటర్ల ప్రేక్షకులకు దగ్గరవుతాననే నమ్మకం ఉంది. నేను మొదట్నుంచి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలే చేస్తున్నా. చూడ్డానికి కమర్షియల్‌ సినిమాలనే ఇష్టపడినప్పటికీ నేను మాత్రం కాన్సెప్ట్‌ చిత్రాలే చేస్తాను. నా నుంచి ప్రేక్షకులు కూడా అవే ఆశిస్తారు. కమర్షియల్‌ సినిమాలు కోరుకోవడం లేదు. పైగా నా దగ్గరికి కూడా అలాంటి కథలు రావడం లేదు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తోనే ‘తిప్పరామీసం’ కూడా సాగుతుంది. ఇందులో నేను నైట్‌ క్లబ్‌లో పనిచేసే డీజేగా కనిపిస్తాను. కేర్‌లెస్‌గా ఉండే నేను మీసం తిప్పేలా, బాధ్యతాయుతంగా ఎలా మారాను?, అమ్మ వల్ల నాలో వచ్చిన మార్పేంటనే కథాంశంతో సాగే చిత్రమిది. నా పాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు నెగటివ్‌ షేడ్స్‌లో సాగుతుంది. హీరోకైనా, విలన్‌కైనా అమ్మ మంచిదే ఉంటుంది. తన కొడుకు మారాలనుకుంటుంది. అలా ఇందులో మా అమ్మ చెప్పే మాటలను నేను అర్థం చేసుకుంటాను. ఆ తర్వాత జరిగే కథ ఆసక్తికరం. తిప్పరామీసం అంటే పౌరుషానికి, బాధ్యతకి ప్రతిబింబం. కానీ మధ్యలో దాని మీనింగ్‌ మారిపోయింది. రాజకీయ నాయకులకు, పొగరుకి దాన్ని వాడుతున్నారు. దానికంటూ ఓ సరైనా అర్థం చెప్పే చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా సాగుతుంది. మంచి డ్రామాకి యాక్షన్‌ తోడైతే ఎంతగా కనెక్ట్‌ అవుతుందో, ఇది అలా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ఇందులో నేను ఏం చేసినా ఆడియెన్స్‌కి నవ్వు తెప్పిస్తుంది. నిక్కీతో వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. నా ప్రతి సినిమాలో మహిళా సాధికారత ఉంటుంది. ఇది మహిళల గౌరవాన్ని పెంచే సినిమా. దర్శకుడు విజరుకృష్ణతో చాలా రోజులుగా ట్రావెల్‌ అవుతున్నా. మా ఆలోచనలు, కంఫర్ట్‌ లెవెల్స్‌ బాగా మ్యాచ్‌ అయ్యాయి. సినిమా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నప్పటికీ కామెడీతోపాటు బి, సి సెంటర్ల ఆడియెన్స్‌కి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. వారికి బాగా కనెక్ట్‌ అవుతుందని నమ్ముతున్నా. నిజానికి ఈ చిత్రం ‘బ్రోచేవారెవరురా’ విడుదల టైమ్‌లోనే పూర్తయ్యింది. వెంటనే మరో సినిమా రిలీజ్‌ చేయడం కరెక్ట్‌ కాదనుకున్నాం. పైగా పెద్ద సినిమాల రిలీజ్‌లున్నాయి. మంచి టైమ్‌ కోసం వెయిట్‌ చేసి ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నాం. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలను ప్రేక్షకులు ఇప్పుడు బాగా ఆదరిస్తున్నారు. కానీ పూర్తిగా కాదు. రామ్‌చరణ్‌ లాంటి పెద్ద హీరో చేసిన ‘రంగస్థలం’ ఎంతో మందికి రీచ్‌ అయ్యింది. కానీ మాలాంటి వాళ్ళు చేస్తే అంత రీచ్‌ ఉండదు. అంటే కాన్సెప్ట్‌ చిత్రాలను ఇంకా అందరు ఆదరించడం లేదు. రానున్న రెండుమూండేండ్లలో పూర్తిగా అలాంటి సినిమాలే వస్తాయనుకుంటున్నా. త్వరలో మూడు సినిమాలను కొత్త దర్శకులతో చేస్తున్నా. అందులో ఒకటి విజరు కృష్ణ ప్రొడక్షన్‌లో ఉంటుంది. అలాగే నారా రోహిత్‌తో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. ఎప్పటికీ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ కథలు, పాత్రలతోనే ప్రేక్షకుల్ని మెప్పించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.