తిప్పారా మీసం మూవీ రివ్యూ

తిప్పారా మీసం మూవీ రివ్యూ

క‌థ‌ల ఎంపికలో శ్రీవిష్ణు అభిరుచి ప్రత్యేకం. అందుకే ఆయ‌న సినిమా వ‌స్తుందంటే విభిన్నమైన క‌థ‌ని చూడొచ్చనే అభిప్రాయంతో ఉంటారు ప్రేక్షకులు. మ‌ధ్యలో కొన్ని చిత్రాలు ప‌రాజ‌యాన్ని చ‌విచూసినా ఆయ‌న శైలి మార‌లేదు. ఇటీవ‌లే ‘బ్రోచేవారెవ‌రురా’తో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీవిష్ణు మార్క్ క‌థతో తెర‌కెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల‌కి మంచి వినోదాన్ని పంచిపెట్టింది. దీంతో ఆ చిత్రం త‌ర్వాత ఆయ‌న చేసిన ‘తిప్పరామీసం’పై మ‌రిన్ని అంచ‌నాలు క‌నిపించాయి. మ‌రి అందుకు త‌గ్గట్టుగా సినిమా ఉందో, లేదో తెలుసుకుందాం.

క‌థేంటంటే: మ‌ణి అలియాస్ మ‌ణిశంక‌ర్ (శ్రీవిష్ణు) డీజే. చిన్నప్పుడే మ‌త్తుమందుకి బానిసైన కుర్రాడు. చికిత్స కోసం పునరావాస కేంద్రంలో చేర్పించ‌డంతో ఒంట‌రి అవుతాడు. త‌ల్లి (రోహిణి)పై క‌క్ష పెంచుకుంటాడు. చికిత్స త‌ర్వాత బ‌య‌టికొచ్చి త‌ల్లికి దూరంగా.. డీజేగా ప‌నిచేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. మ‌త్తుతో పాటు, జూదం కూడా ఆడుతుంటాడు. ఈ క్రమంలోనే క్రికెట్ బుకీకి రూ.30 లక్షలు అప్పుప‌డ‌తాడు. ఆ అప్పుని తీర్చేందుకు త‌ల్లి ద‌గ్గర‌కి వెళ్లి త‌న వాటా ఆస్తి అడుగుతాడు. అంత మొత్తం త‌న ద‌గ్గర లేద‌ని, రూ.5 ల‌క్షలు మాత్రమే ఉన్నాయని చెక్ ఇస్తుంది. దాన్ని ఫోర్జరీ చేసి త‌ల్లిపైనే చెక్ బౌన్స్ కేసు పెడ‌తాడు. మ‌రి ఈ కేసులో ఎవ‌రు గెలిచారు? త‌ల్లిపైనే కేసు వేసిన మ‌ణిశంక‌ర్ త‌న కుటుంబం కోసం ఏమైనా చేశాడా, లేదా? అవ‌స‌ర‌మైన‌ప్పుడు త‌న బాధ్యత‌ల్ని ఎలా నిర్వర్తించాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

సమీక్ష  :  క‌థ కంటే కూడా క‌థ‌నంతో క‌ట్టిపడేస్తున్న రోజులివి. యువ దర్శకులు ఆ విష‌యంలో మ‌రింత నైపుణ్యాన్ని ప్రద‌ర్శిస్తున్నారు. వాళ్ల ఆలోచ‌న‌లు, ప్రతిభపై న‌మ్మకంతో క‌థానాయ‌కులు రంగంలోకి దిగుతున్నారు. ఈ సినిమాని కూడా శ్రీవిష్ణు త‌న పాత్ర, క‌థ‌నంపై న‌మ్మకంతో చేసిన‌ట్టు అనిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లోని ఒక మ‌లుపు సినిమాకు హైలైట్ గా ఉంటుంది. క‌థానాయ‌కుడు మ‌త్తుకి బానిసై చేసే విన్యాసాలు, దుస్తులు విప్పేసి రోడ్ల మీద ప‌రుగెత్తడాలు, అత‌ను ఆడే జూదం.. ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. ప్రథ‌మార్ధంలో క‌థానాయ‌కుడు డ‌బ్బు కోసం త‌ల్లిని వేధించ‌డం కొత్త పాయింట్.  భావోద్వేగాలు చాలా వున్నాయి. ద్వితీయార్ధంలో మ‌లుపుల‌తో క‌థ‌, క‌థ‌నాల్ని గాడిలో పెట్టారు. క‌థానాయ‌కుడి పాత్రలో  ‘తిప్పరామీసం’ అనే పేరుకు ఉన్నంత శ‌క్తి ఉంటుంది. ప‌తాక స‌న్నివేశాల్లో కుటుంబం కోసం క‌థానాయ‌కుడు చేసే ప‌ని ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ద‌ర్శకుడు చెప్పాల‌నుకొన్న క‌థ ప‌తాక స‌న్నివేశాల్లో క‌నిపిస్తుంది.

శ్రీవిష్ణు న‌ట‌న బాగుంది. వ్యతిరేక ఛాయ‌ల‌తో కూడిన పాత్రతో ఆకట్టుకున్నాడు. శ్రీవిష్ణు త‌ల్లి పాత్రలో రోహిణి చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. క‌థానాయిక నిక్కీ తంబోలీ చిన్న పాత్రలో క‌నిపిస్తుందంతే. బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్యర్ పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. సిధ్ కెమెరా  రాత్రివేళల్లో సాగే స‌న్నివేశాల్ని చక్కగా తీసింది.

ఓవరాల్ గా
శ్రీ విష్ణు కెరీర్ లో  వైవిధ్యమైన చిత్రం తిప్పారా మీసం. ఈ తరహా పాత్రలో శ్రీ విష్ణు ఎప్పుడు కనిపించలేదు. కొత్త కథ కథనం ఎంజాయ్ చేయలనుకునేవారు బాగా ఎంజాయ్ చెఏ చిత్రం.

PB Rating : 3/5