తిప్పరా మీసం డైరెక్టర్ విజయ్ కృష్ణ ఇంటర్వ్యూ

అసుర వంటి సూపర్ హిట్ విజయ్ ఖాతాలో ఉంది. ఆ తర్వాత ప్రొడక్షన్ లో బిజీగా ఉండి గ్యాప్ తీసుకొని మళ్లీ తిప్పరా మీసంతో మనముందుకు ఈనెల 8న వచ్చేస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా నటించాడు. శ్రీ విష్ణు ను వైవిధ్యమైన పాత్రలో చూపించబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లోనే….

‘క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఇండియా గెలిస్తే మనం గర్విస్తాం. బోర్డర్‌లో శత్రువులపై గెలిస్తే సైనికులు గర్విస్తారు. అలాగే ఓ కుర్రాడు గర్వించేలా, మీసం తిప్పేలా ఏం పనిచేశాడనేది తెలియాలంటే ‘తిప్పర మీసం’ చిత్రం చూడాల్సిందే. సినిమాల్లోకి రాకముందు ఎల్‌ అండ్‌ టీ కంపెనీలో ఆర్కిటెక్చర్‌గా పనిచేశాను. సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సినిమాల్లో నా తొలి అడుగు నిర్మాతగానే ప్రారంభమైంది. ‘ప్రస్థానం’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. అయితే ఎవరి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేయలేదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’ చిత్రాలను నిర్మించాను. తర్వాత దర్శకత్వం వహించిన ‘అసుర’ చిత్రం దర్శకుడిగా మంచి పేరు తెచ్చింది. ‘తిప్పరమీసం’ యాక్షన్‌ డ్రామా. మన చుట్టూ జరిగే అంశాలను బేస్‌ చేసుకుని ఈ కథ అల్లుకున్నా. డీజేగా పనిచేసే ఓ కుర్రాడు మీసం తిప్పే పని ఏం చేశాడు?, తల్లి కోసం ఎలాంటి సాహసం చేశాడనే ఆసక్తికర కథనంతో సాగే చిత్రమిది. ఐదేండ్ల హీరో జర్నీని తెలియజేస్తుంది. యాక్షన్‌ అంశాలు, మదర్‌ సెంటిమెంట్‌ ఆకట్టుకుంటాయి. శ్రీవిష్ణు ఇందులో డీజే మణిగా కనిపిస్తాడు.
డీజేల లైఫ్‌ మన జీవితానికి భిన్నంగా ఉంటుంది. మన జాబ్‌ ఉదయం ప్రారంభమై, ఈవినింగ్‌తో ముగుస్తుంది. కానీ వాళ్ళది ఈవినింగ్‌ ప్రారంభమై ఏ రాత్రో ముగుస్తుంది. శ్రీవిష్ణు పాత్ర నెగటివ్‌గా ఉంటుంది. బేసిగ్గా మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఈ సినిమా చేయడానికి కూడా ఇదొక కారణం. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి మధ్య కెమిస్ట్రీ, లవ్‌ ట్రాక్‌ అలరిస్తుంది. సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో నిక్కీ కీలక పాత్ర పోషిస్తుంది. సురేష్‌ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం హైలైట్‌ అవుతుంది. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నెక్ట్స్‌ ప్రొడ్యూసర్‌గా రెండు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ఒకటి శ్రీవిష్ణు హీరోగా, మరొకటి వేరే హీరోతో ఉంటుంది. అలాగే నారా రోహిత్‌ హీరోగా నా దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. నిర్మాత, దర్శకత్వం ఈ రెంటింటిలో దర్శకత్వమే కష్టం. నిర్మాతగా డబ్బులు పెడతాం. ఓ దశకు వచ్చాక సినిమా ఆడుతుందో లేదో?, ఎంత వస్తుందో?, ఎంత పోతుందో ఓ క్లారిటీ వస్తుంది. కానీ దర్శకుడు చాలా హార్క్‌ చేయాలి. సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకు ఎంతో కష్టపడాలి. ప్రతిదీ క్రియేటివ్‌గా చేయాలి. ఎంతో మందికి సమాధానం చెప్పాలి. ఇది చాలా టఫ్‌ జాబ్‌’ అని అన్నారు.