రివైండ్ 2014 : టాలీవుడ్ టాప్ టెన్ డిజాస్టర్స్

మంచి ఉన్నపుడు చెడు ఉంటుంది. హిట్ ఉన్నపుడు ఫ్లాప్ కూడా ఉంటుంది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. రికార్డులు సృష్టిస్తాయనుకున్న మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు తోక ముడిచాయి. ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఓ సారి చూసేయండి.

10. అల్లుడుశీను
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. ఈ సామెత అల్లుడుశీనుకు బాగా సరిపోతుంది. కొడుకును మాస్ హీరోగా నిలబెట్టాలని బడ్జెట్ కు వెనకాడకుండా అల్లుడుశీను చిత్రాన్ని నిర్మించాడు బెల్లంకొండ శ్రీనివాస్. వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం బెల్లంకొండ వారసున్ని మాస్ హీరోగా నిలబెట్టింది కానీ.. నిర్మాతకు నష్టాల్నే మిగిల్చింది. 40 కోట్లతో తెరకెక్కిన అల్లుడుశీను.. 24 కోట్ల వసూళ్లతోనే సరిపెట్టుకుని ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది.

09. పైసా
ఎప్పట్ననుంచో వాయిదాలు పడి.. పడి చివరికి ఎలాగోలా బయటపడ్డ సినిమా పైసా. టైటిల్ లో పైసా ఉన్నా.. నిర్మాతలకు మాత్రం పైసా రాల్చలేదు. నాని హీరోగా వచ్చిన ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించాడు. ఓపెనింగ్స్ మాట దేవుడెరుగు.. కనీసం ఈ చిత్రం వచ్చి వెళ్లినట్లు కూడా చాలామందికి తెలియదంటే పైసా చిత్రం ఏ స్థాయిలో నిరాశ పరిచిందో అర్థం చేసుకోవచ్చు.

08. ఆటోనగర్ సూర్య
ఈ ఏడాది టాప్ 5 డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది నాగచైతన్య ఆటోనగర్ సూర్య. దేవాకట్టా తెరకెక్కించిన ఈ చిత్రం చాలా కాలం వాయిదాలు పడి షెడ్డు బయటపడింది.. కానీ లాభం మాత్రం ఏం లేదు. ఏ మాయ చేసావే, మనం లాంటి విజయాల తర్వాత నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన ఆటోనగర్ సూర్య.. వాళ్ల వరస విజయాలకు బ్రేక్ వేసింది. కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక ఘోరంగా నిరాశపరిచింది ఆటోనగర్ సూర్య.

07. పాండవులు పాండవులు తుమ్మెద
మంచు వారి మంచి మల్టీస్టారర్ అంటూ హడావిడి చేసిన పాండవులు పాండవులు తుమ్మెద కూడా భారీగా నిరాశపరిచింది. సినిమా ఓకే అని టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం ఘోరంగా నిరాశపరిచాయి. కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయారు ఈ పాండవులు. శ్రీవాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ లో హిట్టైన గోల్ మాల్ రిటర్న్స్ కు ఫ్రీమేక్.

06. యమలీల2
తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి తన యమలీల చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించిన యమలీల 2 తీవ్రంగా నిరాశపరిచింది. కామెడీ ఎక్స్ పెక్ట్ చేసిన జనాలకు కన్నీళ్లు తెప్పించాడు. హీరోగా ఇంట్రడ్యూస్ అయిన కె.వి.సతీష్ ఖర్చు పెట్టే విషయంలో సక్సెస్ అయినా… కలెక్షన్స్ రాబట్టడంలో ఘోరంగా ఫెయిలయ్యాడు.

05. లడ్డుబాబు
అల్లరి నరేష్ హీరోగా రవిబాబు తెరకెక్కించిన లడ్డుబాబు సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ లో బక్క నరేష్ ను 250 కేజీల లడ్డూబాబుగా చూపించడంతో సినిమాలో ఏదో ఉంటుందని ఆశించి థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులకు తలనొప్పి తెప్పించాడు రవిబాబు. దాంతో ఈ సినిమా నరేష్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది.

04. ఎర్రబస్సు
పరమవీరచక్ర లాంటి డిజాస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని.. దాసరి తెరకెక్కించిన చిత్రం ఎర్రబస్సు. తమిళ్ లో విజయం సాధించిన మంజపై సినిమాను తెలుగులో ఎర్రబస్సుగా రీమేక్ చేసాడు దాసరి. కానీ మరీ 80ల్లో సినిమాలా ఉండటంతో.. తెలుగు ప్రేక్షకులు ఎర్రబస్సు ఎక్కడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. అసలు ఈ సినిమా వచ్చిందెప్పుడో.. పోయిందెప్పుడో కూడా తెలియదు. విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఎర్రబస్సు కూడా ఉంటుంది. ఇక ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ లో సైతం ఈ ఎర్రబస్సు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.

03. రభస
మరో ఏడాది మారినా.. ఎన్టీఆర్ జాతకంలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. 2014లోనూ నందమూరి చిన్నోడి ఫ్లాపుల పరంపర కొనసాగింది. రభసతో ఈ ఏడాది మరో డిజాస్టర్ ఇచ్చాడు ఎన్టీఆర్. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాత బెల్లంకొండను మరింత ముంచేసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. ఆల్రెడీ అల్లుడుశీను షాక్ లో ఉన్న బెల్లంకొండకు రభసతో మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ చిత్రం మిగిల్చిన నష్టాలకు.. కొడుకుతో మొదలుపెట్టిన బోయపాటి సినిమాను ఆపేసాడు బెల్లంకొండ. రభస టాప్ 3 డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

02. నేనొక్కడినే
2014లో భారీగా నిరాశపరిచిన సినిమాల్లో నెంబర్ 2గా నిలిచింది నేనొక్కడినే. మహేశ్ బాబు హీరోగా లెక్కల మాస్టార్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు అస్సలు అర్థం కాలేదు. హాలీవుడ్ రేంజ్ లో సుక్కు చెప్పిన లెక్కలు.. మామూలు జనాల బుర్రల్లోకి ఎక్కలేదు. దాంతో ప్రశంసలు మాత్రమే మిగిలి.. పైసలు మాత్రం రాలేదు. సెలెబ్రెటీస్ అంతా వన్.. నేనొక్కడినే సూపర్ అంటూ పొగిడేసినా.. మహేశ్ కెరీర్ లో మాత్రం అతిపెద్ద డిజాస్టర్స్ లో వన్ ఒకటిగా నిలిచింది.

01. ఆగడు
విచిత్రమేంటంటే.. 2014లో టాప్ 2 డిజాస్టర్స్ మహేశ్ పేరు మీదే ఉండటం. సంక్రాంతికి వన్ తో నిరాశపరిచిన మహేశ్.. దసరాకు ఆగడుతో తలనొప్పి తెప్పించాడు. ఇప్పటి వరకు సినిమాలు ఫ్లాపైనా.. నటుడిగా మహేశ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. కానీ ఆగడు తర్వాత మహేశ్ పై కూడా విమర్శలొచ్చాయి. నాసి రకం కథతో శీనువైట్ల తెరకెక్కించిన ఆగడు.. నిర్మాతలను నిండా ముంచేసింది. 1 నేనొక్కడినే ఇచ్చిన షాక్ తో 14 రీల్స్ సంస్థకు భారీగానే గండి పడింది.

పైన చెప్పినవి కేవలం టాప్ 10 డిజాస్టర్స్ మాత్రమే. వీటితో పాటు వర్మగారి ఐస్ క్రీమ్ 1 అండ్ 2, విష్ణు అనుక్షణం, రౌడీ, మంచు మనోజ్ కరెంటు తీగ, శేఖర్ కమ్ముల అనామిక, సందీప్ కిషన్ జోరు, రారా కృష్ణయ్య, అల్లరి నరేష్ జంప్ జిలానీ, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ ఆది ప్యార్ మే పడిపోయినా, రఫ్ నారా రోహిత్ రౌడీ ఫెలో, సుమంత్ అశ్విన్ చక్కిలిగింత లాంటి చాలా సినిమాలు కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి.