రివైండ్ 2015: టాప్ ఫ్లాప్స్ ఆఫ్ ది ఇయ‌ర్..

అదృష్టం కంటే దుర‌దృష్టం.. లాభం కంటే న‌ష్టం.. సంతోషం కంటే బాధే ఎప్పుడూ ఎక్కువ‌గా ఉంటాయి. ఇండ‌స్ట్రీలోనూ అంతే. ఏడాదికి ఎన్నో వంద‌ల సినిమాలు విడుద‌లవుతుంటాయి. అందులో హిట్ట‌య్యేవి ఏ ప‌దో ప‌ర‌కో. ఫ్లాపులు మాత్రం బోలెడుంటాయి. 2015లో కూడా వంద‌ల సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఎప్ప‌ట్లాగే హిట్ల‌ కంటే ప్లాపులే ఎక్కువ‌. మ‌రి ఈ ఏడాది నిర్మాత‌ల్ని బాగా ఏడిపించిన ఆ దారుణ‌మైన డిజాస్ట‌ర్స్ ఏంటో చూసేద్దామా..!

2015లో డిజాస్ట‌ర్ నెం.5: ల‌య‌న్
లెజెండ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌కృష్ణ నుంచి వ‌చ్చే సినిమా అంటే ఎన్నో అంచ‌నాలుంటాయి. కానీ ల‌య‌న్ మాత్రం వాటిని ఏవీ అందుకోలేక‌పోయింది. స‌త్య‌దేవా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా రాధికాఆప్టే, త్రిష న‌టించారు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా భారీ ప్లాప్ గా నిలిచింది. లెజెండ్ 40 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తే.. ల‌య‌న్ మాత్రం అందులో స‌గం కూడా వ‌సూలు చేయ‌లేక బ‌య్య‌ర్ల‌తో మూడు చెరువుల క‌న్నీళ్లు తాగించింది. రొటీన్ క‌థ‌.. మూస ఫార్ములా ల‌య‌న్ కొంప ముంచేసాయి.

2015లో డిజాస్ట‌ర్ నెం. 4: కిక్ 2
కిక్ తో ర‌వితేజ కెరీర్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆ సినిమా ఇచ్చిన కిక్ తో ర‌వితేజ మార్కెట్ రేంజ్ 30 కోట్ల‌కు పెరిగింది. 2015లో కిక్ కు సీక్వెల్ తీసాడు సురేంద‌ర్ రెడ్డి. రేసుగుర్రం త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి.. ప‌వ‌ర్ త‌ర్వాత ర‌వితేజ‌.. లౌక్యం త‌ర్వాత ర‌కుల్.. ఇలా అంతా స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన కిక్ 2 డిజాస్ట‌ర్ కా బాప్ లా నిలిచింది. మొత్తం క‌లిపి నిర్మాత క‌ళ్యాణ్ రామ్ కు 40 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చైతే.. ఇది వ‌సూలు చేసింది 20 కోట్లు కూడా లేవు. దాంతో నిర్మాత‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా నిలువునా మునిగిపోయారు.

2015లో డిజాస్ట‌ర్ నెం.3: బ్రూస్ లీ
రామ్ చ‌ర‌ణ్ హీరోగా శీనువైట్ల తెర‌కెక్కించిన భారీ సినిమా బ్రూస్లీ. చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా ఇది నిలిచిపోయింది. ఇందులో మూడు నిమిషాల పాటు మెరిసాడు మెగాస్టార్. కానీ ఇది సినిమాకు ఏ మాత్రం యూజ్ కాలేక‌పోయింది. ఎప్పుడో కాలం చెల్లిపోయిన బ‌క‌రా ఫార్ములాని మ‌రోసారి కోన‌తో క‌లిసి వండాడు శీనువైట్ల‌. ఇది ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేదు. దీని ఫ‌లిత‌మే సినిమా డిజాస్ట‌ర్. బ్రూస్లీ 2015 టాప్ 5 డిజాస్ట‌ర్స్ లో స‌గ‌ర్వంగా చోటు సంపాదించింది.

2015లో డిజాస్ట‌ర్ నెం.2: సౌఖ్యం
నిన్న గాక మొన్న విడుద‌లైన సినిమా ఈ ఏడాది టాప్ 2 డిజాస్ట‌ర్ ఏంటి అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. ఈ మ‌ధ్య కాలంలో తొలిరోజే సౌఖ్యం కు వ‌చ్చినంత దారుణ‌మైన టాక్ ఏ సినిమాకు రాలేదు. గోపీచంద్ కెరీర్ లోనే కాదు.. ఆ సినిమాకు ప‌నిచేసిన ఎవ్వ‌రి కెరీర్ లోనూ ఇంత పెద్ద డిజాస్ట‌ర్ ను చూసుండ‌రేమో. లౌక్యం ఇచ్చిన జోష్ లో బ‌య్య‌ర్ల‌కు భారీగానే అమ్మారు సౌఖ్యం. కానీ రెండో రోజు నుంచే సౌఖ్యంను థియేట‌ర్స్ నుంచి వాష్ ఔట్ చేస్తున్నారు. ప‌రిస్థితి చూస్తుంటే బ‌య్య‌ర్ల‌కు భారీగా గండి ప‌డేలా క‌నిపిస్తుంది.

2015లో డిజాస్ట‌ర్ నెం.1: అఖిల్
తొలి సినిమాతోనే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల‌నుకున్నాడు అఖిల్. నిజంగానే బ‌ద్ద‌లుకొట్టాడు. కానీ మ‌రోలా.. బ‌య్య‌ర్ల‌కు న‌ట్టేటా ముంచేసేలా.. నిర్మాత‌ను నిలువునా నిల‌బెట్టేలా.. అఖిల్ దారుణ‌మైన రికార్డుల్ని మూట‌గ‌ట్టుకున్నాడు. తొలిరోజు 10 కోట్ల షేర్ సాధించి డెబ్యూ హీరోల్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అఖిల్.. రెండో రోజు నుంచే చేతులెత్తేసాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల‌కు పైగా చేస్తే.. అఖిల్ వ‌సూళ్ళు మాత్రం 17 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయాయి. దాదాపు 30 కోట్ల‌కు పైగా అఖిల్ న‌ష్టాలు తెచ్చింది. విచిత్ర‌మేంటంటే.. ఈ ఏడాది టాప్ డిజాస్ట‌ర్స్ లో కోన‌వెంక‌ట్ హ‌స్తం ఉన్న సినిమాలే ఎక్కువ‌గా ఉండ‌టం.

ఇవే కాకుండా.. అల్ల‌రి న‌రేష్ బందిపోటు, జేమ్స్ బాండ్.. రామ్ శివ‌మ్.. నాని జెండా పై క‌పిరాజు.. సాయిధ‌రంతేజ్ రేయ్.. నాగ‌చైత‌న్య దోచేయ్.. క‌ళ్యాణ్ రామ్ షేర్.. అనుష్క సైజ్ జీరో.. నిఖిల్ శంక‌రాభర‌ణం, నితిన్ కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్.. విష్ణు డైన‌మైట్.. సంపూర్ణేష్ బాబు సింగం 123, గడ్డంగ్యాంగ్, ఆర్జీవీ 365 డేస్, త్రిపుర లాంటి దారుణ‌మైన డిజాస్ట‌ర్లు ఈ ఏడాది వ‌చ్చాయి. మొత్తానికి 2015లోనూ ఎప్ప‌ట్లాగే స‌క్సెస్ రేట్ 10 శాతానికి మించ‌లేదు. ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి మారాలంటే.. కొత్త క‌థ‌లు రావాలి. కానీ అది జ‌ర‌గడం సాధ్య‌మేనా..? మ‌న హీరోల ఇమేజ్ దానికి అడ్డు ప‌డ‌కుండా ఉంటుందా..? క‌నీసం వ‌చ్చే ఏడాదైనా.. విజ‌యాల శాతం పెర‌గాల‌ని కోరుకుందాం..!