టాలీవుడ్ ను క‌బ్జా చేసిన మెగా ఫ్యామిలీ..

ఒక‌టి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎన‌మిది.. ఏంటీ లెక్క అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీలో ఉన్న మెగా హీరోల సంఖ్య ఇది. ఒక్క ఫ్యామిలీ నుంచి ఇంత‌మంది హీరోలు రావ‌డం.. మ్యాగ్జిమమ్ అంద‌రూ క్లిక్క‌వ్వ‌డం అనేది బ‌హుశా ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదేమో..! చిరంజీవి మెగా ఫ్యామిలీకి ఆద్యుడు. మెగాస్టార్ గా మూడు ద‌శాబ్దాల పాటు తెలుగు తెర‌ను ఏలారాయ‌న. ఈయ‌న పేరు చెప్పుకుని వ‌చ్చిన నాగ‌బాబు హీరోగా నిల‌బ‌డ‌క‌పోయినా.. కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా నిల‌దొక్కుకున్నారు.

ఇక అన్న చాటు త‌మ్ముడిగా 20 ఏళ్ల కింద ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయితో ప్ర‌స్థానం మొద‌లుపెట్టి.. అన‌తి కాలంలోనే అన్న‌ను మించిన త‌మ్ముడిగా మారాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ది ఓ స్పెష‌ల్ జ‌ర్నీ. ఆయ‌న‌దో స‌పరేట్ స్టైల్. ప‌వ‌న్ అంటే ఇప్పుడు ఓ శిఖ‌రం. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పేరు చెప్పుకుని వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్, అల్లుఅర్జున్. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి కుర్ర హీరోల్లో టాప్ పొజిష‌న్ ఎంజాయ్ చేస్తున్న‌వారే. ప‌వ‌న్, చ‌ర‌ణ్, బ‌న్నీ ముగ్గురికీ 50 కోట్ల మార్కెట్ ఉండ‌టం ఇక్క‌డ మ‌రో విశేషం.

ఈ మ‌ధ్యే మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మ‌రో ముగ్గురు కుర్రాళ్లు వ‌రుణ్ తేజ్, సాయిధ‌రంతేజ్, అల్లుశిరీష్. వీళ్ల‌లో శిరీష్ ను లెక్క‌లోంచి ప‌క్క‌న బెట్టేయొచ్చు. ఇక మెగా మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్ మాత్రం సైలెంట్ గా వ‌చ్చి సంచ‌ల‌నాలు చేస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం,సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ సినిమాల‌తో సాయి ఇమేజ్ పెరిగిపోయింది.

సుప్రీమ్ హిట్ తో సాయిధ‌రం మార్కెట్ ఏకంగా 25 కోట్ల‌కు చేరిపోయింది. నాలుగు సినిమాల‌తోనే ఈ ఫీట్ అందుకున్నాడు సాయి. ఇప్పుడు మ‌నోడి చేతిలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయి. ఇక వ‌రుణ్ తేజ్ కూడా ముకుందా, కంచె సినిమాల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం శీనువైట్ల‌తో మిస్ట‌ర్.. శేఖ‌ర్ క‌మ్ముల‌తో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు. వీళ్లు చాల‌ర‌న్న‌ట్లు కొణిదెల నిహారిక సైతం ఒక మ‌న‌సుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మెగా ఫ్యామిలీ నుంచి ఇంత‌మంది హీరోలు ఉండ‌గానే ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు హీరోలు వ‌స్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. వాళ్లు మరెవ‌రో కాదు.. సాయిధ‌రంతేజ్ త‌మ్ముడు వైష్ణవ్ తేజ్.. మ‌రొక‌రు చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్. వీళ్లలో వైష్ణ‌వ్ ప్ర‌స్తుతం తన చదువుకు కొనసాగిస్తూ నటన, డాన్స్, ఫైట్స్ ఇలా వివిధ కేటగిరీల్లో శిక్షణ పొందుతున్నాడు. మ‌రో ఆలోచ‌న లేకుండా ఫ్యూచ‌ర్ లో హీరో అవ్వాల‌ని ఫిక్సైపోయాడు ఈ చిన్న తేజ్. ఇక మావ అండ‌తో క‌ళ్యాణ్ సైతం న‌ట‌న వైపు అడుగేస్తున్నాడు. చూస్తుంటే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంత‌మంది హీరోలు రావ‌డం కూడా మంచిది కాద‌నే ఫీలింగ్ ప్రేక్ష‌కుల్లో క‌లుగుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.