తెలుగు ఇండ‌స్ట్రీ "న‌వ్వు" ఏడుస్తోంది…

తెలుగు సినిమాకు శాపం త‌గిలిన‌ట్లుంది.. టాలీవుడ్ లో ఉన్నంత మంది క‌మెడియ‌న్లు ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో మ‌రెక్క‌డా క‌నిపించ‌రు. ఎలాంటి ఇగోల్లేకుండా ఒక్కో సినిమాలో డ‌జ‌న్ పైగా క‌మెడియ‌న్లు క‌లిసి న‌టించే ఇండ‌స్ట్రీ తెలుగు సినిమా మాత్ర‌మే. కానీ ఇప్పుడు ఏదో అవుతుంది. ఒక్కొక్క‌రుగా న‌వ్వించే తార‌లు.. తార‌ల్లోకి చేరిపోతున్నారు. గ‌త రెండేళ్లుగా తెలుగు సినిమా న‌వ్వ‌డం మానేసి ఏడుస్తుంది. ఒక్కో హాస్య‌న‌టుడు నింగికి చేరిపోతున్నాడు.

తెలుగు సినిమా సీనియ‌ర్ క‌మెడియ‌న్ కొండ‌వ‌ల‌స క‌న్నుమూసారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఈయ‌న చికిత్స పొందుతూనే మ‌ర‌ణించారు. ఈయ‌న మ‌ర‌ణం తెలుగు సినిమాకు తీర‌నిలోటే. ఎంత‌మంది క‌మెడియ‌న్లు ఉన్నా.. కొండ‌వ‌ల‌సది ఓ ప్ర‌త్యేక‌శైలి. ఆయ‌న మాట విరుపు.. ఆయ‌న యాస‌.. ఐతే ఓకే అంటూ ఆయ‌న పలికే డైలాగులు ఓ స‌ప‌రేట్ స్టైల్. ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు నుంచి ఎన్నో వంద‌ల సినిమాల్లో కొండ‌వ‌ల‌స త‌న కామెడీతో క‌డుపులు చెక్క‌లు చేసారు. ఇప్పుడు క‌న్నీటి చుక్క‌లు మిగులుస్తూ ఆయ‌న నింగికేగారు.

ఈ మ‌ధ్య కాలంలో ఎంతోమంది హాస్య‌న‌టులు క‌న్నుమూసారు. నిన్న‌గాక మొన్న సీనియ‌ర్ క‌మెడియన్లు మాడా, క‌ళ్లు చిదంబ‌రం మ‌న‌కు దూరం అయ్యారు. ఇక ఏడాది మొద‌ట్లోనే ఎమ్మెస్ నారాయ‌ణ లాంటి స్టార్ క‌మెడియ‌న్ టాలీవుడ్ కి దూర‌మ‌య్యారు. జ‌న‌వ‌రిలో ఆహుతి ప్ర‌సాద్ క్యాన్స‌ర్ తో క‌న్నుమూసారు. 2013లో ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం, ఏవీఎస్ లాంటి స్టార్ క‌మెడియ‌న్లు ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఇలా ఒక్కొక్క‌రుగా క‌మెడియ‌న్లు క‌న్నుమూస్తుంటే.. తెలుగు సినిమా హాస్యం విషాదంగా మారుతోంది. వాళ్ల నవ్వుల‌కు ఆనంద‌భాష్పాలు చిందించిన క‌ళ్ల నుంచి.. క‌న్నీటివాన జాలువారుతోంది.