రివైండ్ 2015: ఏ ద‌ర్శ‌కుడి ప‌రిస్థితి ఏంటి..?

2015లో అప్ క‌మింగ్ ద‌ర్శ‌కుల‌కు బాగా క‌లిసొచ్చింది.. కానీ పేరు మోసిన ద‌ర్శ‌కుల ప‌రువు మాత్రం తీసేసింది. ఒక‌రిద్ద‌రు అగ్ర ద‌ర్శ‌కులు మిన‌హా.. బ‌డా డైరెక్ట‌ర్లు ఎవ్వ‌రూ స‌త్తా చూపించ‌లేక‌పోయారు. ఈ ఏడాది రాజ‌మౌళిదే అగ్ర‌పీఠం. బాహుబ‌లితో త‌న‌కు తానే పోటీ.. సాటి అని నిరూపించుకు న్నాడు రాజ‌మౌళి. ఈ సినిమాతో దేశ‌వ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ బాహుబ‌లి విజ‌య దుంధుభి మోగించింది. దాంతో 2015 రాజ‌మౌళికి బాగా క‌లిసొచ్చింది. మూడేళ్ల క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితాన్ని అనుభ‌వించాడు రాజ‌మౌళి.

ఇక రాజ‌మౌళి త‌ర్వాత ఈ ఏడాదిని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని మ‌రో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. శ్రీ‌మంతుడుతో ఈ ద‌ర్శ‌కుడి ఇమేజ్ తారాస్థాయికి వెళ్లిపోయింది. ఓ సోష‌లో మెసేజ్ ఉన్న క‌థ‌ను అంత క‌మ‌ర్షియ‌లైజ్ చేసి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసే విజ‌యం అందించ‌డం అంటే చిన్న‌విష‌యం కాదు.. కానీ కొర‌టాల మాత్రం దీన్ని చాలా సింపుల్ గా చేసాడు. మ‌హేశ్ లాంటి సూప‌ర్ స్టార్ తో సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థ చేసి.. దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాడు. కొర‌టాల కోసం ఇప్పుడు టాప్ హీరోలు కొట్టుకుంటున్నారు.

కెరీర్ మొద‌ట్లో బూతు ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నా.. కొత్త‌జంట‌తో తాను మారిపోయాన‌ని నిరూపించుకున్న ద‌ర్శ‌కుడు మారుతి. ఈ ఏడాది భ‌లేభ‌లే మ‌గాడివోయ్ తో ఈయ‌న స్థాయి మ‌రింత పెరిగిపోయింది. ఈ సినిమాతో భారీ విజ‌యం సొంతం చేసుకుని క్రేజీ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు మారుతి. ఇక తొలి సినిమాతోనే ఇండ‌స్ట్రీపై త‌న‌దైన ముద్ర వేసాడు అనిల్ రావిపూడి. ప‌టాస్ తో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ప్యాకేజ్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. రామ‌య్యా వ‌స్తావ‌య్యాతో ప్లాప్ అందుకున్న హ‌రీష్ శంక‌ర్.. ఈ ఏడాది సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ తో ఫామ్ లోకి వ‌చ్చాడు. అయితే ఇది పాత రొటీన్ క‌థ కావ‌డంతో.. ఇప్ప‌టికీ స్టార్స్ ఎవ‌రూ హ‌రీష్ వైపు చూడట్లేదు.

మూడేళ్లు ఖాళీగా ఉన్నా.. బెంగాల్ టైగ‌ర్ తో మంచి విజ‌య‌మే అందుకున్నాడు సంప‌త్ నంది. డిసెంబ‌ర్ 10న విడుద‌లైన ఈ సినిమా ర‌వితేజ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇక కుమారి 21 ఎఫ్ తో సూర్య‌ప్ర‌తాప్ త‌న టాలెంట్ ఏంటో చూపించాడు. క్రెడిట్ మొత్తం సుకుమార్ కు వెళ్లినా.. కుమారిని తెర‌కెక్కించింది సూర్య‌ప్ర‌తాపే అని మ‌రిచిపోకూడ‌దు. ఇక సినిమా చూపిస్త మావా లాంటి హై రేంజ్ ఎంట‌ర్ టైన‌ర్ తో త్రినాథ‌రావ్ న‌క్కిన కూడా మోస్ట్ వాంటెడ్ అనిపించుకున్నాడు. జీనియ‌స్ తో జ‌నాల‌కు బోర్ కొట్టించిన ఓంకార్ అన్న‌య్యా.. ఈ ఏడాది రాజుగారి గ‌దితో అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేసాడు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఓంకార్ టాలెంట్ తెలిసింది. ఇంకా భ‌లే మంచి రోజు లాంటి విభిన్న‌మైన సినిమాతో శ్రీ‌రామ్ ఆదిత్య వ‌స్తూ వ‌స్తూనే త‌న‌దైన ముద్ర చూపించాడు. రుద్ర‌మ‌దేవితో గుణ‌శేఖ‌ర్ ఓకే అనిపించాడే గానీ.. సూప‌ర్ హిట్ కొట్ల‌లేక‌పోయాడు. అయితే గ‌త ప‌న్నెండేళ్లుగా స‌రైన విజ‌యం లేని గుణ‌శేఖ‌ర్ కు ఈ సినిమాతో కాస్త ఊర‌ట దొరికింది.

రాజ‌మౌళి మిన‌హా.. అగ్ర ద‌ర్శ‌కులెవ్వ‌రికీ ఈ ఏడాది పెద్ద‌గా క‌లిసిరాలేదు. నెంబ‌ర్ వ‌న్ మాస్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న వినాయ‌క్.. అఖిల్ ను ఈ ఏడాది లాంచ్ చేసాడు. కానీ సినిమా మాత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాతో వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌పై కూడా విమ‌ర్శ‌లొచ్చాయి. ఇక శీనువైట్ల సైతం బ్రూస్లీతో మ‌రో ఫ్లాప్ అందుకున్నాడు. ఆగ‌డు త‌ర్వాత వ‌చ్చిన ఈ సినిమా శీనువైట్ల క్రేజ్ ను మ‌రింత దిగ‌జార్చింది. పూరీ జ‌గ‌న్నాథ్ కూడా టెంప‌ర్ తో కాస్త ప‌ర్లేద‌నిపించినా.. జ్యోతిల‌క్ష్మి, లోఫ‌ర్ సినిమాల‌తో పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చేసిన ఒకే ఒక్క సినిమా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి. ఇందులో విలువ‌లు మ‌రీ ఎక్కువైపోవ‌డంతో యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. అయితే 50 కోట్ల షేర్ సాధించి బ‌న్నీ ఇమేజ్ ఏంటో తెలియ‌జేసింది స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి. వీళ్ళే కాకుండా చిన్ని చిత‌కా ద‌ర్శ‌కులు కూడా బోలెడంత మంది ఈ ఏడాది ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్ళెవ్వ‌రూ త‌మదైన ముద్ర వేయ‌లేక‌పోయారు.