ఫోరెన్సిక్ రిపోర్టు వ‌చ్చేసింది…రేపు చంద్ర‌బాబుకు నోటీసులు..?

ఓటుకు నోటు కేసు కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిదేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఆడియో టేపు ట్యాప్ కాకుండా ఫోన్‌లో రికార్డు చేసిందేన‌ని ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల్లో తేలిన‌ట్టు ఆ వ‌ర్గాల స‌మాచారం. చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇది కట్ అండ్ పేస్ట్ కాద‌ని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ కేసులో పూర్తి వివ‌రాల‌తో కూడిన స‌మ‌గ్ర నివేదిక‌ను బుధవారం మధ్యాహ్నం ఏసీబీకి అందించబోతున్నట్లు తెలిసింది. ఆ నివేదిక అందిన తర్వాత ఇతర లాంఛనాలు పూర్తిచేసుకుని గురువారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి.

చంద్ర‌బాబు వాయిస్‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చిన నేప‌థ్యంలో తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తు వేగాన్ని పెంచనుంది. ఫోరెన్సిక్ నివేదిక త‌మ‌కు కీల‌కం కానుంది..అది త‌మ‌కు అందిన వెంట‌నే తాము చంద్ర‌బాబుకు నోటీసులు జారీ చేస్తామ‌ని తెలంగాణ ఏసీబీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.