త్రివిక్ర‌మ్ కు షాక్ ఇచ్చిన స్టార్ హీరోలు

అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌ది ఒక్క‌టి అనే సామెత ఇప్పుడు త్రివిక్ర‌మ్ విష‌యంలో అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతుంది. గ‌తంలో సినిమా సినిమాకి రెండేళ్లు గ్యాప్ తీసుకునే మాట‌ల మాంత్రికుడు.. ఈ మ‌ధ్యే కాస్త జోరు పెంచాడు. ఆ మ‌ధ్య జులాయిని కేవలం ఏడు నెల‌ల్లోనే పూర్తి చేసిన త్రివిక్ర‌మ్.. ఆ త‌ర్వాత అత్తారింటికి దారేదిని సైతం నెల‌ల వ్య‌వ‌ధిలోనే పూర్తిచేసాడు. అయితే సినిమాల షూటింగ్ అయితే స్పీడ్ గా పూర్తి చేస్తోన్న త్రివిక్ర‌ముడు.. సినిమా సినిమాకు మ‌ధ్య గ్యాప్ మాత్రం త‌గ్గించ‌లేక‌పోతున్నాడు. అత్తారింటికి దారేది షూటింగ్ క్లైమాక్స్ లో ఉన్న‌పుడే బ‌న్నీ సినిమాకు క‌మిటైన మాట‌ల మాంత్రికుడు.. అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి మ‌ధ్య మ‌రోసారి ఏడాదిన్న‌ర తీసుకున్నాడు. ప‌వ‌న్ గ‌తేడాది రాజ‌కీయాల్లోకి రావ‌డం.. అత‌డి వెంట త్రివిక్ర‌మ్ ఉండ‌టం వంటి కార‌ణాల‌తో ఇంత గ్యాప్ తీసుకున్నాడు త్రివిక్ర‌మ్.
       

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత అయినా వేగంగా సినిమాలు చేద్దామ‌నుకున్న మాట‌ల మాంత్రికుడికి ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలేలా ఉంది. ఈ ద‌ర్శ‌కుడితో ఇప్ప‌టికిప్పుడు సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలెవ‌రూ ఖాళీగా లేరు. చ‌ర‌ణ్-శీనువైట్ల‌, మ‌హేశ్-శ్రీకాంత్ అడ్డాల‌, ఎన్టీఆర్-సుకుమార్, బ‌న్నీ-బోయ‌పాటి.. ఇలా వీళ్లంతా మ‌రో ఏడాది వ‌ర‌కు బిజీ. అంటే స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత త్రివిక్ర‌మ్ చేయ‌డానికి స్టార్స్ అందుబాటులో లేరు. మ‌రిలాంటి టైమ్ లో త‌న త‌ర్వాతి సినిమా ఎవ‌రితో చేస్తాడో ఈ మాట‌ల మాంత్రికుడు..?