మోదీపై టీఆర్‌ఎస్ ఫైర్‌…హైకోర్టు ఏర్పాటుకు ఉడుం ప‌ట్టు

హైకోర్టు విభజనలో కేంద్రం ఎడ‌తెగ‌ని జాప్యం చేస్తోందంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు ధ్వజమెత్తారు. ఈ అంశంపై పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఆధ్వర్యంలో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి, విన‌తి అందించారు. అనంతరం మీడియాతో కేకే మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటినా ఇంకా హైకోర్టును విభజించకపోవడం బాధాకరం. దీనికిగాను చేయని ప్రయత్నం లేదు. అయినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. హైకోర్టు విభజనకు సంబంధించి రాజ్యాంగపరమైన విధి నిర్వహణలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది. దానిని అమలు చేయించాల్సిన బాధ్యత గవర్నర్‌పైనా ఉంది. చివరికి ఆయన కూడా విఫలమయ్యారు’ అని దుయ్యబట్టారు.

హైకోర్టును ఉద్దేశ పూర్వకంగా విభజించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభను స్తంభింపజేస్తామన్నారు. హైకోర్టు విభజన జరిగే వరకు తెలంగాణకు సంబంధించిన కేసులు ఏపీకికి చెందిన జడ్జిల ముందు పెట్టవద్దని డిమాండ్‌ చేస్తామన్నారు. ప్రధాని మోదీపై టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష ఉపనేత వినోద్‌కుమార్‌ విరుచుకుపడ్డారు. హైకోర్టు విభజనపై మోదీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీనిపై తాను ఏపీ సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడ‌తాన‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ టీ – ఎంపీల‌కు హామీ ఇచ్చారు.