చికెన్ కొన‌లేద‌ని చంపేశాడు..హ‌త్య‌కు ప్రతీకారంగా హ‌త్య‌

అనంత‌పురం జిల్లా, ముదిగుబ్బ మండలం, కొడవాండ్లపల్లి గ్రామంలో త‌న వ‌ద్ద చికెన్ కొన‌లేద‌ని ఆగ్రహంతో ఊగిపోయిన షాపు య‌జ‌మాని నిండు ప్రాణాన్ని బ‌లిగొన్నాడు. దీంతో హ‌తుడి కోసం వెతికిన బాధితుడి బంధువులు అత‌డి కనిపించ‌క‌పోయేస‌రికి, స‌హ‌నం కోల్పోయి నిందితుడి పెద‌నాన్న‌ను బండ‌రాయితో మోది అమాన‌వీయంగా చంపేశారు. వ‌రుస హ‌త్యోదంతాల‌తో అనంతపురం ఉలిక్కిప‌డింది. రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి.

రామ‌కృష్ణ‌.(50) చికెన్ కొనుక్కొని ఇంటికి వెళ్తుండ‌గా అటుగా వచ్చిన మ‌రో షాపు య‌జ‌మాని నాగముని రామకృష్ణను అడ్డుకున్నాడు. ‘మా నాన్న దగ్గర చికెన్‌ ఎందుకు తీసుకోలేదు?’ అంటూ వాగ్వాదానికి దిగాడు. ఇది కాస్తా.. పెరిగి పెద్దదై ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నాగముని.. బండరాయి తీసుకొని రామకృష్ణ తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న రామకృష్ణ బంధువులు.. నాగముని ఇంటికి వెళ్లారు. అప్పటికే నాగముని ఊరి నుంచి పరారయ్యేస‌రికి, కోపాన్ని అణుచుకోలేక బాధితులు నిందితుడి ఇంట్లో ఉన్న నాగముని తండ్రి పెద్దన్న (50)ను బండరాయితో మోది హత్య చేశారు. వ‌రుస హ‌త్య‌ల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.