సూర్యాపేట కాల్పుల వెనక వారి హస్తమే…!

తెలంగాణలో సంచలనం కలిగించిన సూర్యాపేట కాల్పుల ఘటనకు కారకులెవ్వరు అన్న దానిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తొలుత నక్సలైట్లు ఈ ఘటన వెనక ఉన్నారా అన్న అనుమానాలు వచ్చాయి. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన దోపిడీ గ్యాంగ్ హస్తం ఈ కాల్పుల వెనక ఉన్నట్టు సమాచారం. మీరట్‌కు చెందిన ఇర్ఫాన్ గ్యాంగ్ హస్తం ఈ కాల్పుల వెనక ఉండవచ్చిని పోలీసులు కూడా ప్రాధమిక నిర్దారణకు వచ్చారు.

కొద్ది రోజులుగా సూర్యపేట హైవేలో దొంగతనాలు జరుగుతున్నాయి. కొందరు ప్రయాణికులను బెదిరించి రాత్రివేళల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. పట్టణంలోని హైటెక్ బస్టాండులో రాత్రి 11 గంటల తర్వాత ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులపై దండుగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే చనిపోయారు.

సీఐ మొగిలయ్య, కానిస్టేబుల్ అరవింద్, హోంగార్డు కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు. చనిపోయిన పోలీసులు కుటంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 నుంచి 40 లక్షల వరకు పరిహారం ప్రకటించనుంది.