సత్యప్రకాష్ దర్శకత్వంలో గురురాజ్ నిర్మాతగా ప్రారంభమైన ‘ఉల్లాల్లా ఉల్లాల్లా’

విలన్ గా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న సత్య ప్రకాష్ తనయుడు నటరాజ్ హీరోగా ఉల్లాల ఉల్లాల పేరుతో ఓ సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సత్యప్రకాష్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ చిత్రం హైదరాబాద్ లో డైరెక్టర్ తేజ క్లాప్ తో ప్రారంభమైంది. ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నటులు బెనర్జీ, అశోక్‌కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నటరాజ్‌, నూరిన్‌ షెరిఫ్‌, అంకిత మహరాణ, గురురాజ్‌ కీలక పాత్రధారులుగా సుఖీభవ మూవీస్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. గురురాజ్‌ నిర్మాత.

సత్య ప్రకాష్ మాట్లాడుతూ ‘‘మా సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు దెయ్యాలా లేక మనుషులా అనేది తెరపైనే చూడాలి. మా చిత్రంలో ఉన్నది లేదు, లేనిదే ఉన్నట్టు చూపిస్తున్నాం. ఒక వైవిధ్యమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. అన్ని శాఖలపైన పట్టున్న నిర్మాత గురురాజ్‌ ఈ సినిమాకి ఒక వెన్నెముకలా నిలిచార’’న్నారు.

నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది ‘రక్షక భటుడు’, ‘ఆనందం’, ‘లవర్స్‌ డే’ చిత్రాలు చేశాను. వాటి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒక అరుదైన కాన్సెప్ట్‌ని చెప్పారు సత్యప్రకాష్‌. అది నచ్చే ఈ సినిమా నిర్మిస్తున్నా. కథానాయకుడు నటరాజ్‌కి కన్నడంలో స్మైలింగ్‌ స్టార్‌ అని పేరుంది. తెలుగులో తొలిసారి నటిస్తున్నార’’న్నారు.

‘‘మా నాన్న ఈ సినిమాకి దర్శకుడనే విషయం నాకు చాలా రోజుల వరకు తెలియదు. తెలిశాక ఆయన దర్శకత్వంలో నేను నటించగలనా అని సందేహించా. చిత్రీకరణ మొత్తం కుటుంబంతో కలిసి ఉన్నంత సరదాగా సాగింది’’ అన్నారు కథానాయకుడు నటరాజ్‌. ‘‘లవర్స్‌ డే’ సినిమాలో నా పాత్ర నచ్చి ఇందులో నటించే అవకాశం ఇచ్చార’’న్నారు నూరిన్‌ షెరిఫ్‌. పృథ్వీ, అదుర్స్‌ రఘు, లోబో, జబర్దస్త్‌ నవీన్‌, వింజమూరి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జాయ్‌ రాయరాల, ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ.