ఉప్పల్ స్టేడియం సీజ్.. ఐపీఎల్ ఎలా?

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం కష్టాల్లో పడింది.ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేయడంతో ఇండస్ర్టియల్‌ ఏరియా అథారిటీ( ఐలా) అధికారులు స్టేడియాన్ని సీజ్ చేశారు. స్టేడియంనుంచి ఐలాకు రూ. 12 కోట్లు బకాయిలు రావలసి ఉంది. బకాయిలకు సంబంధించి ఇప్పటికే అనేకసార్లు నోటీ సులు పంపించారు. అయినా సంస్థ స్పందించలేదు. దీంతో గత శనివారమే ఉప్పల్ స్టేడియాన్ని సీజ్ చేయాలని ఐలా ప్రయత్నించింది. అయితే అదే రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉండటంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ ఐలా అధికారులతో చర్చలు జరపడంతో .. మరికొంత గడువు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. తాజాగా ఆ గడువు కూడా ముగియడంతో ఐలా అధికారులు స్టేడియాన్ని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 11, 15, 17 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సమయంలో ఈ క్రికెట్‌ స్టేడియంను అధికారులు స్వాధీనం చేసుకోవడం ఐపిఎల్‌ నిర్వహణకు విఘాతం ఏర్పడినట్టే. మ్యాచ్ మరో రెండు రోజులు గడువే ఉండటంతో స్టేడియం నిర్వాహకులు టెన్షన్ లో పడ్డారు. ఒకవేళ పన్ను కట్టడంల విఫలమై మ్యాచ్ ఆగిపోతే అంతర్జాతీయంగా క్రికెట్‌ ప్రపంచంనుంచి విమర్ళలు ఎదుర్కోవలసివస్తుంది.