జారిప‌డ్డ జార్జిబుష్‌…తీవ్ర‌గాయాల‌తో చికిత్స‌

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యు బుష్ తన ఇంట్లో ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. దీంతో ఆయన మెడ ఎముక విరిగిపోయింది. ప్ర‌స్తుతం ఆయ‌న పోర్ట్ లాండ్ మెయిన్ మెడికల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. ఈ వార్త అమెరికాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సీనియ‌ర్ బుష్ ఆరోగ్యంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. తొలుత ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరిన విషయాన్ని ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది మెక్ గ్రాతే!

జార్జి బుష్‌ అమెరికాకు 41వ దేశాధ్యక్షుడిగా (1989-1993) పని చేశారు. గత నెలలోనే జార్జి బుష్ 91వ పడిలోకి అడుగుపెట్టారు. 2014లో కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో జార్జి బుష్ ఆస్ప‌త్రిలో చేరారు. గత వారంలో జార్జి బుష్ దంప‌తులు అధ్యక్ష ఎన్నికల కోసం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన కుమారుడు జూనియర్ బుష్ కూడా అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు.