ఈనెల 14న వజ్ర కవచధర గోవింద గ్రాండ్ రిలీజ్…..

హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ఈ చిత్రంలో వైభవీ జోషీ కథానాయికగా నటించారు. అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్య తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా

సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ సినిమాల్లో హీరోగా నటించాను. ఒకటి హిట్‌ సాధిస్తే, మరొకటి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం నాకు పేరు, డబ్బు రెండూ తీసుకురావాలని కోరుకుంటున్నాను. చిన్న బడ్జెట్‌ సినిమా అయినా బయట మంచి స్పందన లభిస్తోంది. అప్పారావు, అవినాష్‌ ఇందులో చాలా మంచి పాత్రలు చేశారు. టీమ్‌ అందిరికీ థ్యాంక్స్‌. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’’ అన్నారు.

‘‘సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. సప్తగిరి బాగా నటించారు. ఎంత బడ్జెట్‌ అయినా ఫర్వాలేదని నిర్మాత నాకు భరోసా ఇచ్చారు’’ అన్నారు అరుణ్‌పవార్‌.

‘‘ఒక ఊరి ప్రజలను హీరో ఏ విధంగా కాపాడాడు? అన్నదే ఈ చిత్రం కథ. మా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం. మమ్మల్ని ఇంతదూరం నడిపించిన సప్తగిరిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు నిర్మాతలు.

‘‘32 ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సప్తగిరితో పాటు టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు బ్రహ్మయ్య.