పరిటాల రవి స్కెచ్‌తోనే… స్పాట్ టైటిల్‌తో వర్మ నెక్స్ట్ సినిమా

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ తన సెక్స్ట్ సినిమా టైటిల్‌ను స్పాట్ పేరుతో ఎనౌన్స్ చేశాడు. వర్మ దర్శకత్వం వహించిన ఐస్‌క్రీం-2 ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తాజా సినిమా స్పాట్‌కు రక్తచరిత్ర సినిమాలోని ఓబుల్‌రెడ్డి హత్యే ప్రేరణ అని చెప్పారు. తాను రక్తచరిత్ర సినిమా తీసినప్పుడు అనంతపురం జిల్లాలో పర్యటించి చాలామంది ఫాక్షనిస్టులతో కలిసి తిరిగానని చెప్పారు. ఆ సమయంలో 1996లో జరిగిన ఓబుల్‌రెడ్డి హత్య స్పాట్ పెట్టిన వారు చెప్పిన అంశాలు విని తన రొమాలు నిక్కపొడుచుకున్నట్టు తెలిపారు.

ఓబుల్‌రెడ్డిని చంపేందుకు పరిటాల రవి మనుషులు వేసిన స్కెచ్ వింటే తాను భయబ్రాంతులకు గురైనట్టు కూడా వర్మ చెప్పాడు. ఒక మనిషిని చంపేందుకు స్కెచ్ వేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి.. అది మిస్‌కాకుండా ఎలా ప్లాన్ చేయాలన్నదానిపై ప్రత్యర్థులు ఏ స్థాయిలో స్కెచ్ వేస్తారన్నదే ఈ సినిమా కథాంశమన్నారు. అయితే రక్తచరిత్ర సినిమాలో కేవలం పది నిమిషాల పాటే ఈ హత్యను చూపించాల్సి వచ్చిందని.. అయితే ఈ అసంతృప్తి తనను వెంటాడుతూనే ఉందని.. ఈ స్టోరీతో పూర్తి సినిమా చేయాలన్న లక్ష్యంతోనే తాను స్పాట్ సినిమా చేస్తున్నట్టు వర్మ తెలిపారు. ఏదేమైనా అనంత ఫ్యాక్షన్ చరిత్రతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన వర్మ మరోసారి అదే చరిత్రతో స్పాట్ సినిమా తీస్తున్నట్టు ప్రకటించి సంచలనానికి తెరలేపాడు.