వీడే సరైనోడు మూవీ రివ్యూ

నయనతార కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోల మాదిరిగానే నయనతార సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. డిజిటల్ శాటిలైట్ లోనూ ఆమెకు ఎదురులేదు. మంచి కాన్సెప్ట్ సినిమా కథలు ఎంచుకొని దూసుకెళ్తోంది. అలా నయనతార హీరోయిన్ గా… స్టార్ హీరో జీవా హీరోగా కలిసి నటించిన చిత్రం వీడే సరైనోడు. తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ చిత్రాన్నితెలుగు ప్రేక్షకుల కోసం అందించారు. నోవా సినిమాస్‌ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం అందించారు.

కథేంటంటే: బ్లేడు(జీవా) ఓ అనాథ. దాంతో చిన్నప్పటి నుంచే నాగ అనే పేరు మోసిన రైస్ మిల్లర్ కం రౌడీ సంరక్షణలో పెరిగి.. అతనికి రైట్ హ్యాండ్ గా వూంటూ.. హత్యలు, రౌడీయిజం చేస్తూ బతికేస్తుంటాడు. అదే నాగతో బిజినెస్ పార్టనర్ గా వుండే వ్యక్తి కూతురు దివ్య(నయనతార)ను ప్రేమిస్తూ.. వుంటాడు. అయితే బ్లేడు రౌడీ కావడంతో అతనితో వివాహానికి దివ్య తల్లిదండ్రులు నిరాకరించి వేరే వ్యక్తితో ఆమెకు వివాహం చేయాలని ఫిక్స్ అవుతారు. అయితే దివ్య మనసు మాత్రం బ్లేడు మీదే వుంటుంది. ఈ నేపథ్యంలో ఓ సంఘటనతో వీరిద్దరి మధ్య వున్న ప్రేమాయణం… ఊరందరికీ తెలిసిపోతుంది. దాంతో ఆ వూరి నుంచి వెళ్లిపోవడానికి దివ్య తల్లిదండ్రులు నిశ్చయించుకుంటారు. దాంతో తన పార్టనర్ నాగతో తనకున్న బిజినెస్ పార్టనర్ షిప్ లో పెట్టిన రూ.20 లక్షలు తిరిగి ఇచ్చేస్తే… తాను వెళ్లిపోతానంటాడు. అందుకు నాగ నిరాకరిస్తాడు. మరి దివ్య తండ్రి తన రూ.20 లక్షలను వదిలేసి వెళ్లిపోయాడా? బ్లేడుతో తన కూతురు వివాహానికి ఒప్పుకున్నాడా? లేదా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
టైటిల్ కు తగ్గట్టుగానే ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసినప్పటికీ… అన్ని వర్గాల్ని మెప్పించే కంటెంట్ ఈ చిత్రంలో ఉంది. హీరో జీవా ఇప్పటి వరకు క్లాస్ ఆడియన్స్ ను అలరించాడు. అందుకే ఫుల్ మాస్ యాక్షన్ తో మెప్పించడానికి ఓ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ చేయడానికి ఈ చిత్రం చేశాడు. దర్శకుడు కూడా అందుకు తగ్గట్టుగానే పూర్తిగా మాస్ టచ్ వున్న కథ, కథనాలను రాసుకుని తెరకెక్కించారు. పాత్రలన్నీ కూడా ఇందులో ఫుల్ మాస్ గానే వుండేలా జాగ్రత్త పడ్డారు దర్శకుడు. యవ హీరోల్లో మాస్ టచ్ ను చూపిస్తే.. ఎలా వుంటుందో.. జీవాతో ఇందులో చేయించి చూపించారు దర్శకుడు. ఫుల్ మాస్ లుక్ లో జీవాను బి,సి సెంటర్ల ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా అతని పాత్రను గానీ… మిగతా సపోర్టింగ్ పాత్రలను తెరమీద తీర్చిదిద్దారు. అలానే నయనతార పాత్రను కూడా ఓ దిగువ మధ్య తరగతి అమ్మాయిగా హాఫ్ శారీలో చాలా చక్కగా చూపించారు. కథ జరిగే ప్రాంతాలను మొదలుకుని.. పాత్రలు వుండే ఇండ్ల దాకా అన్ని జాగ్రత్తలు తీసుకుని చాలా నాచురల్ గా పాత్రలను తెరమీద చూపించారు దర్శకుడు. జీవాతో చేయించిన మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. అలానే డైలాగులు కూడా. అలానే విలన్ క్యారెక్టర్ కూడా చాలా చాలా నాచురల్ గా వుంది. ఓవరాల్ గా ‘వీడే సరైనోడు’ చిత్రం ఫుల్ మాస్ ఎంటర్టైనర్.

హీరో జీవా గతంలో ‘రంగం’ చిత్రంతో క్లాస్ ఆడియన్స్ ను మెప్పించారు. ఆ తరువాత మాస్ ఆడియన్స్ కు దగ్గర కావడానికి చేసిన ఈ చిత్రం నూరుశాతం ఫలించిందనే చెప్పాలి. మాస్ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్ ఎపిసోడ్స్ ను బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రైస్ మిల్ యాక్షన్ సీన్ మాస్ ను బాగా ఆకట్టుకుంటుంది. అలానే క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో కూడా బాగా చేశాడు. అతనికి జంటగా నటించిన నయనతార కూడా మాస్ లుక్ లో పల్లెటూరి అమ్మాయిగా చక్కగా నటించారు. విలన్ నాగ పాత్రలో నటించిన తమిళ నటుడు కూడా చాలా బాగా రౌద్రాన్ని పండించారు. మిగతా పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు నటించారు.

జీవాను మాస్ హీరోగా ఎలివేట్ చేయడానికి దర్శకుడు రాసుకున్న కథ, కథనాలు ఎక్కడా బోరింగ్ లేకుండా బాగున్నాయి. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లా యాక్షన్ ఎపిసోడ్స్ గానీ, పాటలను గానీ తెరమీద చాలా చక్కగా చూపించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అనువాదం బాగుంది. సంభాషణలు కూడా తెలుగులో బాగా రాశారు. మాస్ ఆడియన్స్ ను ‘వీడే సరైనోడు’ అలరిస్తుంది. గో అండ్ వాచ్..!

రేటింగ్: 3.25/5