వినరా సోదరా వీర కుమారా మూవీ రివ్యూ

వినరా సోదరా వీర కుమారా సినిమా గురించి ఇటీవల ప్రత్యేకంగా మాట్లాడుకున్నారంతా. కారణం ఈ సినిమా ట్రైలర్స్ సాంగ్స్. కొత్త తరహా కథనంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారని అర్థమైంది. ట్రేడ్ సర్కిల్స్ లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా నటించారు. లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసిందో లేదో చూద్దాం.

కథేంటంటే… ఆటో డ్రైవర్ గా పనిచేసే రమణ(శ్రీనివాస్ సాయి), అదే గ్రామంలో ఇంజినీరింగ్ చదివే సులోచన(ప్రియాంక జైన్)ను ప్రేమిస్తాడు. అయితే ఆమె మాత్రం తన ప్రేమను అంగీకరించదు. రమణ మాత్రం సులోచన ప్రేమను దక్కించుకోవడానికి ఆమె బావ చేతిలో చావుదెబ్బలు కూడా తింటాడు. అలా తన ప్రేమను దక్కించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొని చివరకు సులోచన మనసులో చోటు సంపాధించుకుంటారు. అయితే ఆమె పెళ్లికి మాత్రం అంగీకరించదు. తన బావను పెళ్లి చేసుకుంటానని వెళ్లిపోతుంది. దాంతో రమణ తన చనిపోయిన స్నేహితుడి కోరికలను తీర్చడానికి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన రమణ… ఇచ్చిన మాట ప్రకారం స్నేహితుడి కోరికలను తీర్చాడా? అసలు చనిపోయిన వ్యక్తికి కోరికలేంటి. స్నేహితుడు ఎవరు? అనేదే ఈ సినిమాలో ఓ కొత్త పాయింట్. అది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
ఈ తరహా కథ, కథనం మనం ఇప్పటివరకు చూసి ఉండం. ప్రేమ కథల్లో ఇదో కొత్త తరహా కథ, కథనం. విభిన్నమైన స్నేహాన్ని ఇందులో దర్శకుడు చూపించాడు. ఇప్పటి వరకు అనేక ప్రేమకథలను వెండితెర మీద చూసుంటాం. అవన్నీ ప్రేమ, రొమాన్స్ ప్రధాన పాయింట్ మీదనే తెరమీద అలరించాయి. ఇందులో వీటితో పాటు… ప్రేమికులకు, తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇవ్వడానికి ఎంచుకున్న కొత్తపాయింట్… దాన్ని ముందుకు నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే కొత్తగా వుంది. ఈ పాయింట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ కొత్త పాయింట్ కి తోడుగా… శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ ల మధ్య తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీ బాగుంది. అలాగే వీరిద్దరి మధ్య తెరకెక్కిన రొమాంటిక్ లవ్ సీన్స్ ను కూడా దర్శకుడు యూత్ ను అలరించేలా తెరకెక్కించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదరింది. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో జీవించారనే చెప్పాలి. ముఖ్యగా రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయి మరీ నటించారు. భావోద్వేగాల్ని బాగా పలికించారు. ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. సినిమా చివరలో ప్రేమికులకు ఇచ్చిన సందేశం బాగుంది. తప్పకుండా ఆలోచించే పాయింట్ ఇది. తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఎక్కడా ఒల్గారిటీకి తావులేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా ఇది.

హీరో శ్రీనివాస్ సాయి చాలా ఎనర్జిటిక్ గా నటించారు. రవితేజ, నాని పెర్ ఫార్మెన్స్ ని తలపించేలా యాక్ట్ చేసాడు. తన మాస్ లుక్ తో యూత్ ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా పాటల్లోనూ… యాక్షన్ సీన్స్ లోనూ తన ఈజ్ నెస్ తో ఆకట్టుకుంటాడు. అలానే తనకు జంటగా నటించిన ప్రియాంక జైన్ హోమ్లీ లుక్ తో.. చాలా క్యూట్ గా వుంది. ఎక్కడ తడబాటు లేకుండా తన ఎక్స్ ప్రెషన్స్ ను ప్రెజెంట్ చేసింది. రొమాంటిక్ సీన్స్ లో యూత్ కు కనువిందు చేస్తుంది. హీరో హీరోయిన్లు పెయిరే ఇందులో ప్రధాన ఆకర్షణ. హీరో తండ్రిగా నటించిన ఉత్తేజ్, తల్లిగా నటించిన ఝాన్సీ తమ పాత్రలకు న్యాయం చేశారు. గ్రామీణ వాతావరణానికి సంబంధించిన వ్యక్తులుగా చాలా చక్కగా నటించారు. హీరో ప్రెండ్ గా నటించిన బాల నటుడు కూడా చక్కగా నటించాడు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన జెమిని సురేష్, రవిరాజ్, పవన్ రమేష్, సన్ని, రోషన్, జైబోలో చంటి తదితరులంతా త పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

డైరెక్టర్ సతీష్ చంద్ర నాదెళ్ల ఎంచుకున్న ప్రేమకథ.. దానికి తోడు ఎంచుకొన్న ఓ కొత్తపాయింట్.. దానిని నడిపించడానికి రాసుకున్న కథనం… చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. యూత్ కి మంచి మెసేజ్ ఇవ్వాలని రాసుకున్న పాయింట్ అందరినీ మెప్పిస్తుంది. దీనికి తోడు ల‌క్ష్మీభూపాల రాసిన సంభాషణలు హృదయాన్ని తాకేలా వున్నాయి. ఈ చిత్రానికి సంగీతం కూడా బాగా ప్లస్ అయింది. రొమాంటిక్ సాంగ్స్ బాగున్నాయి. ఉప్పాడ బీచ్ అందాలతో పాటు గ్రామీణ వాతావరణాన్ని వెండితెరమీద ఎంతో రిచ్ గా చూపించారు సినిమాటోగ్రాఫర్. అలానే పాటల పిక్చరైజేషన్ బాగుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్, పాటలు బాగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. నిర్మాత లక్ష్మణ్ ఎక్కడా రాజీ పడలేదు.

ఓవరాల్ గా,,,, ఇటీవలే హుషారు అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చూశాం. బ్లాక బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు వినరా సోదర వీర కుమార పేరుతో మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమకోసం ప్రాణాలను ఒదిలే యువతకు ఓ మంచి మెసేజ్ ఇచ్చే చిత్రంగా రూపొందిన ఈ చిత్రం యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలున్నాయి.. సో గో అండ్ వాచిట్…

PB Rating : 3/5