నీతిపై అవినీతి.. అన్యాయంపై న్యాయం.. చెడుపై మంచి.. ఇలా అన్నింటిపై తాము విజయం సాధించామంటున్నాడు విశాల్. తమిళనాట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మొన్న జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ గ్రూప్ గెలిచింది. నడిగర్ సంఘం జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోనున్నాడు విశాల్. అక్కడి భాష కాదు.. అక్కడి రాష్ట్రం కాదు.. కానీ అన్యాయం జరుగుతుంటే ఆపడానికి అక్కటోడే అయి ఉండాల్సిన అవసరం లేదని నిరూపించాడు విశాల్.
గత కొన్నేళ్ల నుంచి ఏకగ్రీవంగా శరత్ కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈయనకు ఎదురొచ్చే ధైర్యం కూడా ఏ నటుడూ చేయలేదు. రజినీకాంత్, కమల్, విజయ్, అజిత్ లాంటి టాప్ హీరోలు ఈ ఎన్నికల్ని లైట్ తీసుకోవడంతో ప్రతీసారి నడిగర్ సంఘం ఎలక్షన్స్ కూల్ గానే జరిగాయి. కానీ ఈసారి మాత్రం శరత్ కుమార్ కు వ్యతిరేకంగా విశాల్ ఎన్నికల బరిలో నిలిచాడు. తమకు ఓటేయాలని నటుల్ని నేను కోరడం లేదనీ.. మీ మనసుకు నచ్చింది చేయండంటూ అరవ నటుల్ని కోరాడు విశాల్. అనుకున్నట్లు అయింది.. సరిగ్గా ఎలక్షన్స్ రోజే విశాల్ పై దాడులు జరగడం.. అంతకుముందు విశాల్ గురించి శరత్ కుమార్ వర్గం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఇవన్నీ విశాల్ వర్గానికే కలిసొచ్చాయి. ఎన్నికల్లో భారీ గెలుపుకు ఇదే బాటలుగా దోహదపడ్డాయి.
విశాల్, శరత్ కుమార్ మధ్య రచ్చ ఈనాటిది కాదు.. మూడేళ్ల కింద ఈ సమస్య మొదలైంది. ఎమ్జీఆర్ కట్టించిన నడిగర్ సంఘం బిల్డింగ్ ను శరత్ కుమార్ పడగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ చేసాడు. ఈ విషయం విశాల్ కు తెలిసి అడ్డుపడ్డాడు. తనతో పాటు నాజర్ లాంటి సీనియర్ నటుల సాయం తీసుకున్నాడు. అప్పట్నుంచీ శరత్ కుమార్ నడిగర్ సంఘానికి చేస్తున్న అక్రమాలపై గళం విప్పుతూనే ఉన్నాడు ఈ తెలుగు హీరో. ఇప్పుడు ఆ వైరం చిలికి చిలికి గాలివానగా మారింది. ఎన్నికల బరిలో శరత్ కుమార్ కు ఆపోజిట్ గా నిలబడి ఆయన్ని ఓడించి.. ఆయన గర్వం దించేవరకు వచ్చింది యవ్వారం.
శరత్ కుమార్ ప్యానల్ నుంచి అధ్యక్ష బరిలో ఉన్న కుర్రహీరో శింబు అడ్రస్ లేకుండా పోయాడ. ఆవేశంలో వచ్చేసి ఆ మధ్య విశాల్ ను కుక్క, నక్క అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు శింబు. అంతేకాదు.. నిన్నగాక మొన్నొచ్చిన బచ్చా విశాల్.. వాడికేం తెలుసు ఇండస్ట్రీ గురించి అంటూ నోటికొచ్చినట్లు రెచ్చిపోయాడు ఈ లిటిల్ సూపర్ స్టార్. ఇంత జరిగినా విశాల్ మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. ఈ ఎదురు చూపులన్నింటికీ ఎలక్షన్ రిజల్టే సమాధానం ఇచ్చింది. పైగా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా తమిళనాట వినిపిస్తున్నాయి. ఇప్పుడు శరత్ కుమార్ పై గెలిచి.. ఇటు నడిగర్ సంఘంలో విలువని, అటు అమ్మాయిని రెండు వైపుల నుంచి దెబ్బ కొట్టాడు విశాల్. ఎంతైనా.. తెలుగోడి దెబ్బకు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ కూసాలు కదిలిపోయాయి.