వ‌రంగ‌ల్ పోరు: టీఆర్ఎస్ టిక్కెట్టు శ్రీహ‌రి చేతిలో

షెడ్యూల్ రాకున్నా.. అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల అభ్య‌ర్థులెవ‌రో తేల‌కున్నా.. ఇప్పుడంతా వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌పై దృష్టిసారించారు. ఇక్క‌డి లోక్‌స‌భ‌ స్థానాన్ని ఏ విధంగానైనా ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్‌.. బీజేపీ ఆరాట‌ప‌డుతుంటే.. మెజార్టీపైనే ఆశ‌లు పెంచుకుంటోంది టీఆర్ఎస్‌. ఇప్ప‌టికే ఈ స్థానాన్ని భారీ మెజార్టీతో ద‌క్కించుకున్న క‌డియం శ్రీ‌హ‌రి తద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి, డిప్యూటీ సీఎం అయిన విష‌యం తెలిసిందే!

కేసీఆర్ కొద్ది రోజుల క్రితం వ‌రంగ‌ల్ జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం ప‌ద‌వి నుంచి రాజయ్య‌ను త‌ప్పించి, అదే సామాజిక వర్గానికి చెందిన క‌డియంను నియ‌మించారు. దీంతో వ‌రంగ‌ల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ ఎంపీ స్థానాన్ని ద‌క్కించుకునే బాధ్య‌త‌ను శ్రీ‌హ‌రి చేతిలో ఉంచారు కేసీఆర్‌. దీంతోఆయ‌న సూచించిన పేరునే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌డియం 3.92 ల‌క్ష‌ల ఓట్ల ఆధిక్యంతో ఘ‌న‌విజ‌యం సాధించారు. టీఆర్ఎస్ నేత‌లు ఇప్పుడు ఆ మెజార్టీ కంటే ఎక్క‌వ వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి సిరిసిల్ల రాజ‌య్య‌పై ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న క‌డియం ఈ సారి త‌న కుమార్తె , అసిస్టెంట్ ప్రొఫెస్ డాక్ట‌ర్ కావ్య‌ను రంగంలోకి దించాల‌ని యోచిస్తున్నారు. త‌ద్వారా త‌న సామాజికవ‌ర్గానికి మరింత చేరువ‌కావ‌చ్చ‌న్న‌ది ఆయ‌న భావ‌న‌. ఐతే.. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్, బీజేపీ త‌మ ప‌ట్టు నిల‌బెట్టుకునేందుకు, చెప్పుకోద‌గ్గ స్థాయిలో పోటీ ఇచ్చేందుకు, ఓటు బ్యాంకు రాబ‌ట్టుకునేందుకు య‌త్నిస్తున్నాయి. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉంద‌ని కాంగ్రెస్‌,టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తుంటే గులాబి నేత‌లు మాత్రం త‌మ విజ‌యం న‌ల్లేరుమీద న‌డ‌కేఅంటున్నారు.