పోరుగ‌ల్లులో ప్ర‌భంజ‌నం సృష్టించేనా! టీఆర్ఎస్ వెర్స‌స్ బీజేపీ…

ఎన్నిక‌లు.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. ఉప ఎన్నిక‌లు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఇలా ఏడాదంతా ఎన్నిక‌లు. పోరు తీరు ఎలా ఉన్నా.. గెలుపు త‌ప‌న మాత్రం త‌ప్ప‌దు! ఇప్పుడు పోరుగ‌ల్లు ఓరుగ‌ల్లులో ఉప ఎన్నిక‌లు ఢంకా మోగింది. క‌డియం శ్రీ‌హ‌రి వ‌రంగ‌ల్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశాక ఇక అక్క‌డ పోల్ సీన్ అన‌వార్య‌మైంది. క‌డియం శ్రీ‌హ‌రి ఖాళీ చేసిన స్థానాన్ని.. ఎలాగైనా తిరిగి ద‌క్కించుకోవాల‌ని గులాబీ ద‌ళం భావిస్తుంటే.. నిన్న‌మొన్న‌టి దాకా అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల్లో మునిగితేలిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య కానుంది. ఇక  తెలుగుదేశం పార్టీకి కూడా ఓటుకు నోటు వ్యవహారంతో ఉన్న పరువును కాస్త పోగొట్టుకొంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బరిలో త‌ల‌ప‌డుతోంది. అందుకు తెలుగు దేశం మ‌ద్ద‌తు కూడా తీసుకొంటోంది. జ‌న‌సేనాని నుంచి కూడా అండ‌దండ‌లు కోరుకుంటోంది. దీంతో వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక పోరు ర‌స‌వ‌త్త‌ర‌మే!   టీఆర్ఎస్ వెర్స‌స్ బీజేపీలో గెలుపెవ‌ర‌ద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే!

ఇప్ప‌టికే ప‌ట్టుపెంచుకునే దిశ‌లో బీజేపీ ఉండ‌గా.. స్థాన బ‌లాన్ని రెట్టింపు చేసుకునే క్ర‌మంలో కేసీఆర్ అండ్ కో ఉంది. గులాబీ ద‌ళం త‌ర‌ఫున క‌డియం కుమార్తె  కావ్యను బరిలోకి దింపే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ఊహాగానాలున్నా బీజేపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌నే లేదు. రేపో..మాపో ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌స్తే గానీ అభ్య‌ర్థుల బ‌లాబ‌లాల్ని అంచ‌నావేయ‌లేం. మొత్తానికి క‌మ‌ల‌నాథుల‌కు ఇది ఉనికికి సంబంధించిన యుద్ధం. గెలుస్తుందో /  లేదో .. ఇక గులాబీ ద‌ళానికి మెజార్టీయే ప్ర‌ధానం. ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో క‌డియం 6,61,3339 ఓట్ల‌తో భారీ విజ‌యం ద‌క్కించుకున్నారు గ‌నుక‌. నాటి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన సిరిసిల్ల రాజ‌య్య ర‌న్ ర‌ప్ గా నిల‌వ‌గా బీజేపీ ప్రాబ‌ల్యం మూడో స్థానానికి ప‌డిపోయింది. క‌మ‌ల ద‌ళం త‌ర‌ఫున పోటీచేసిన ప్రొద్దుటూరి ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి పెద్ద‌గా.. ఓట‌రును ప్ర‌భావితం చేయ‌లేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై బీజేపీ హై క‌మాండ్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. కాంగ్రెస్ కూడా ఎవ‌రి పేరునూ డిసైడ్ చేసే స్థితిలో లేదు.