ఉద్దేశపూర్వకంగా తీసిన సినిమా కాదిది – యాత్ర డైరెక్టర్ మహి.వి.రాఘవ్

తెలుగు చిత్రసీమలో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ‘మహానటి’ తర్వాత మరిన్ని చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లాయి. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ తెరకెక్కింది. అయితే ఇది వై.ఎస్‌ జీవితంలో ఓ భాగమైన పాదయాత్ర ఘట్టం ఆధారంగానే తెరకెక్కింది. ‘ఆనందోబ్రహ్మ’తో విజయాన్ని అందుకొన్న మహి వి.రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. వై.ఎస్‌. పాత్రలో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించారు. ఫిబ్రవరి 8న ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మహి వి.రాఘవ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ…

వై.ఎస్‌ జీవితాన్ని ఒక బయోపిక్‌లా కాకుండా, కేవలం పాదయాత్ర ఘట్టాన్నే ఎందుకు తీయాలనిపించింది?
కేవలం పాదయాత్రకి సంబంధించిన విషయాలే కాదు, కొన్ని ఉప ఘట్టాలూ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకులు ఎప్పుడూ ఒకరి సమాచారం తెలుసుకోవడానికి సినిమాకి రారు. వినోదం కోసం, భావోద్వేగానుభూతి కోసమే వస్తారు. అందుకు వై.ఎస్‌ జీవితంలోని పాదయాత్ర ఘట్టమైతేనే సరైందనిపించింది. ఆయన మిగతా జీవితాన్నీ పెంచలదాస్‌ పాడిన ఓ పాటలో చూపించే ప్రయత్నం చేశాం.

‘యాత్ర’కు ప్రేరణనిచ్చిన విషయాలేంటి?
ఉద్దేశపూర్వకంగా తీసిన సినిమా కాదిది. ఆటోలో వెళుతున్నప్పుడో, సామాన్య ప్రజలతో మాట్లాడుతున్నప్పుడో వై.ఎస్‌ గురించి మంచి మాటలే వినిపించేవి. ‘ఆనందోబ్రహ్మ’ సమయంలో వై.ఎస్‌ పాత్ర నాలో మరింత ఆసక్తిని పెంచింది. అందులోంచి పురుడు పోసుకొన్న ఆలోచనే ఈ ‘యాత్ర’.

ఈ సినిమాకి ముందు వై.ఎస్‌ కుటుంబాన్ని కలిశారా?
ఈ సినిమా పోస్టర్‌ సిద్ధమయ్యాకే పాద యాత్రలో ఉన్న జగన్‌ని కలిసి ఈ చిత్రం గురించి చెప్పా. టీజర్‌ని విడుదల చేశాక ఆయన్ని కలిస్తే బాగుందని మెచ్చుకొన్నారు. సినిమా చూస్తారా అని అడిగితే ‘మీ నాయకుడి కథని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చూసి నా అభిప్రాయాలు చెబితే సృజనాత్మకంగా సినిమా దెబ్బతింటుంది కదా’ అన్నారు.

వై.ఎస్‌. పాత్రకి మొదట మమ్ముట్టినే తీసుకోవాలనుకొన్నారా ?
ఆ పాత్రలో గర్వం లేకుండా, వినయంతో కనిపించే నటుడు కావాలనుకొన్నా. అందుకు మమ్ముట్టి అయితేనే కరెక్ట్‌ అనిపించింది. ఆయన్ని సంప్రదిస్తే ‘నేనే ఎందుకు?’ అన్నారు.‘దళపతి’లో ఓ సన్నివేశం గుర్తు చేసి చెప్పాక ఆయన ఒప్పుకొన్నారు.

ఎన్నికలపై ‘యాత్ర’ ప్రభావం ఉంటుందా?
ఒక సినిమా ఎన్నికల్ని ప్రభావితం చేస్తుందంటే నేను నమ్మను. ఎవరికి ఓటేస్తే ఎలాంటి లాభం ఉంటుందో ప్రజలు లెక్కలేసి మరీ చెబుతున్నారు. సినిమావల్ల అదనంగా రెండు మూడు ఓట్లు కూడా రావనుకొంటా. ఒకవేళ వస్తే మంచిదే.

వై.ఎస్‌.జగన్‌, చంద్రబాబు పాత్రలు ఇందులో ఉంటాయా?
జగన్‌కి సంబంధించిన కొన్ని నిజమైన దృశ్యాలు ఉంటాయంతే. చంద్రబాబు నాయుడి పాత్ర సినిమాలో ఉండదు.

‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’తో పాటే ఈ సినిమాని ఎందుకు విడుదల చేయాలనుకొంటున్నారు?
ఒకే తరహా సినిమాలు, ఒకేసారి విడుదలైతే అది ఆసక్తి కరంగా మారుతుంది. అది రెండు సినిమాలకీ మంచిదే.

‘యాత్ర’ ప్రయాణం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
నాకు తెలియని విషయాల్ని సేకరించి ఈ సినిమా చేశా. చాలా విషయాల్లో ఇది నా తొలి సినిమా అన్న అనుభూతినిచ్చింది. తదుపరి సినిమా అనేది ఫలితాల్నిబట్టే ఉంటుంది.