యాత్ర మూవీ రివ్యూ

దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్ర ఎంతటి పేరు సంపాదించిందో తెలిసిందే. నాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. అయితే ఆయన పాదయాత్ర చేయడానికి కారణాలు… చేసిన సందర్భంలో ఎదురైన అనుభవాలు, పేద ప్రజల గొంతుక ఆధారంగా యాత్ర అనే చిత్రాన్ని రూపొందించారు. ఆనందో బ్రహ్మ చిత్రంతో హిట్ అందుకున్న మహి.వి.రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. మమ్ముట్టి ఈ చిత్రంలో వై.ఎస్.ఆర్ పాత్రలో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథేంటంటే…
వై.ఎస్.ఆర్. పాదయాత్రనే మెయిన్ గా తీసుకున్నారిందులో. వై,ఎస్.ఆర్ (మమ్ముట్టి) హై కమాండ్ ను కాదని పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేయడం. పార్టీకి చెప్పకుండానే పాదయాత్ర చేయడం… చివరికి హై కమాండ్ దృష్టిలో పడడం… ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం… ఆయన మరణం…. ఇదీ యాత్రలో చూపించిన మెయిన్ అంశాలు. ఇందులో ఆయన పాదయాత్ర సందర్భంగా చాలా పథకాల్ని ప్రకటించారు. ఆ పథకాలు ప్రకటించడానికి ఆయన్ని కదిలించిన అంశాల్ని దర్శకుడు ఎంచుకున్నాడు.

సమీక్ష
ఈ సినిమాకు సంబంధించి ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ముందుగా దర్శకుడు మహి వి రాఘవ, నటుడు మమ్ముట్టి, నిర్మాతలు. మహి వి రాఘవ ఎలాంటి కాంట్రవర్శీలకు వెళ్లకుండా జాగ్రత్తగా స్క్రిప్ట్ రచన చేశాడనిపించింది. ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా మెయిన్ గా యాత్రనే కొనసాగించాడు. ప్రతీ సీన్ ను ఎమోషల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
అధిష్టానానికి వ్యతిరేకంగా ధైర్యంగా వైఎస్ఆర్ ఎలా ముందుకు వెళ్లాడో చాలా బాగా చూపించాడు. పాదయాత్ర సందర్భంగా రైతు ఆత్మహత్య, వృధ్దుల ఫించన్, ఆరోగ్య శ్రీ ఇలా చాలా పథకాలకు నాంది పలికాడు. ఈ పథకాలు ప్రకటించే ముందు కూడా అధిష్టానానికి చెప్పకుండానే చేశాడు. ఆ తర్వాత వారిని ఒప్పించాడు. వైఎస్ఆర్ పేదల కష్టాల్ని ఎలా తెలుసుకున్నాడో చూపించాడు. ఆ కష్టాల్ని చూసిన తర్వాత తన పంథాను కూడా మార్చుకున్నాడు. ఇవన్నీ దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ గురించిన సీన్స్ ని తెలివిగా హ్యాండిల్ చేశాడు.

గెలిచే అవకాశం లేని పార్టీని ఎలా గెలిపించాడనేది మెయిన్ థీమ్ గా చూపించారు. పాదయాత్ర సమయంలో ఎదురయ్యే సంఘటనల్ని అధ్భుతంగా మలిచాడు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యా ప్రయత్నం, సెకండాఫ్ లో ఒక్క రూపాయి డాక్టర్ సీన్ అద్భుతంగా ఉంది. భావోద్వేగాన్ని నింపేశాడు. ప్రజల గుండెల్లో కొలిచే మహానేతగా ఎలా ఎదిగాడో చూపించాడు. సామాన్యుడి కష్టాల్ని చూపించాడు కాబట్టి ప్రతీ ప్రేక్షకుడు కనెక్ట్ అవుతారు. ఓ పార్టీ సినిమాగా కాకుండా జనరలైజ్ చేసి చూపించాడు. ముఖ్యంగా రైతు బాధల్ని బాగా చూపించాడు. ఎవరైనా ఈ సీన్స్ కు కనెక్ట్ అవుతారు. పాదయాత్ర ప్రభావం రాష్ట్ర రాజకీయాల్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో చూపించాడు.

మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. వైఎస్ఆర్ ని ఇమిటేట్ చేయకుండా ఆయన ఛరిష్మా ఏ మాత్రం తగ్గకుండా సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ చూపించాడు. ఆయన రియల్ లైఫ్ లో ని సోల్ ని పట్టుకున్నారు. తనదైన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీతో పాత్రకు ప్రాణం పోశాడు. క్లైమాక్స్ లో ఒరిజినల్ వైఎస్ఆర్ విజువల్స్ వేశారు. ఆ సమయంలో పెంచల్ దాస్ పాడిన పాటను బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వేశారు. వైఎస్ఆర్ మరణించినప్పటి విజువల్స్ చూస్తే కంట్లో నీళ్లు రాకుండా ఉండవు.

డైలాగ్స్ సైతం చాలా బాగా రాశారు. ఆలోచించే విధంగా రాశారు. “నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ ఉండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు..స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌.. మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు క‌నీసం రైతులుగా బతకనివ్వండి’ అలాగే “నేను విన్నాను నేను వున్నాను’ ఇలాంటి డైలాగ్స్ కి క్లాప్స్ పడ్డాయి. ఈ తరహా ఎమోషనల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి.

సంగీత దర్శకుడు ‘కె’ అద్భుతమైన నేపథ్యం సంగీతం సమకూర్చాడు. అలాగే పాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. సందర్భానుసారంగా వచ్చే పాటలు సినిమా కథను ఎక్కడా డిస్ట్రబ్ చేయకుండా సాగాయి. వీటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది.. నిర్మాతలు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్ గా….
ఈ సినిమా కేవలం వైఎస్ఆర్ అభిమానులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా. వైఎస్ఆర్ పాత్రను ఆధారంగా యాత్రగా రూపొందించిన ఈ సినిమా హైలీ ఎమోషనల్ మూవీగా చెప్పొచ్చు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు ప్రతీ ఒక్కర్నీ కదిలిస్తాయి. ప్రతీ ప్రేక్షకుడు చరిత్రలో జరిగిన విషయాల్ని తెలుసుకుంటారు. సో గో అండ్ వాచిట్.

Rating : 3.5/5