ఆరు నెలల్లో వైకాపా దుకాణం బంద్

ఆరు నెలల్లో వైకాపా ఖాళీ అవ్వడం ఖాయమని తేదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మూడున్నర దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన జేసీ తర్వాత మొన్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తేదేపాలో చేరారు. తర్వాత చాలా లక్కీఛాన్స్ కొట్టేశారు. ఆయన చిరకాల కోరికను కూడా నెరవేర్చుకున్నారు. జేసీ అనంతపురం నుంచి ఎంపీగాను, ఆయన తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగాను విజయం సాధించారు. తాజాగా శనివారం విజయవాడలో జరిగిన ఏపీ ఎంపీల సమావేశంలో ఆయన వైకాపాపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మరో ఆరునెలల్లో వైకాపా ఖాళీ అవుతుందన్నారు.

తాను మొన్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని, ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పగా అదే నిజమైందన్నారు. ఇప్పుడు మరో ఆరు నెలల్లో వైకాపా ఖాళీ కావడం ఖాయమన్నారు. అలాగే వైకాపా ఆరు నెలల్లో ఖాళీ అవ్వడంతో పాటు జగన్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తేదేపాలోకి రానున్నానరని, వీరు మంచి ముహూర్తం చూసుకుని తేదేపాలో చేరడం ఖాయమన్నారు. అలాగే ఆయనే స్వయంగా పలువురు వైకాపా ఎమ్మెల్యేలు తేదేపాలోకి వస్తున్నారని చెప్పిన వార్తలు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు జగన్ వైఖరి నచ్చక తేదేపా గూటికి చేరారు. ఆ దారిలో ఇకెంతమంది ఉన్నారనే దానిపై ఇప్పుడు చర్చలు ప్రారంభమయ్యాయి. ఏదేమైనా జేసీ అంతకుముందు కూడా చెప్పిన పలు జోస్యాలు నిజం అవ్వడంతో ఇప్పుడు వైకాపా పరిస్థితి ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.